Holi Ramzan Friday Security| నేడు ఒకవైపు హోలీ పండుగ, మరోవైపు ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలోని శుక్రవారం. ఈ రెండూ ఒకేరోజున కావడంతో శుక్రవారం మధ్నాహ్నం ప్రార్థనల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్రిక్తలు జరిగే చోట ముందస్తుగానే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడేందుకు పారామిలిటరీ దళాలతో పాటు 25,000 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఢిల్లీలో 300కు పైగా సమస్యాత్మక ప్రదేశాలను పోలీసులు గుర్తించి.. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల సహాయంతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
హోలీ వేడుకలు ఘనంగా జరిగే రాజస్థాన్ విషయానికొస్తే.. రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైపూర్ అదనపు పోలీస్ కమిషనర్ రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. దాదాపు 1,500 మంది కానిస్టేబుల్స్ , 80 మంది సర్కిల్ ఆఫీసర్లు, 40 మందికి పైగా అసిస్టెంట్ కమిషనర్లు, 11 మంది అదనపు డిప్యూటీ కమిషనర్లు.. భద్రతా ఏర్పాట్లను చూసుకుంటున్నారని తెలిపారు. అలాగే 300 మందికి పైగా మహిళా సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారని ఆయన తెలిపారు. హోలీ పండుగ జరుపుకోవడానికి జైపూర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చే అవకాశముండడంతో అక్కడ భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉన్నాయి.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయాలను అనుసరించి.. సామరస్యంగా హోలీ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోలీ సందర్భంగా ఎవరిపైన అయినా బలవంతంగా రంగులు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. పరస్పర గౌరవంతో జరుపుకునే పండుగలు మరింత ఆనందాన్ని ఇస్తాయన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హోలీ మరియు రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకే రోజు జరుగుతున్నందున, ప్రతి జిల్లాలోని శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హోలీ రోజున అణువణువునా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్, స్టంట్ బైకింగ్‌లపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాలను మోహరించామని యూపీ పోలీసు అధికారులు తెలిపారు. ఇదే విధంగా వివిధ రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read: రూపాయి సింబల్ రూపకర్త తమిళుడే.. డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడే!
హైదరాబాద్‌లో ఆంక్షలు
హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా భద్రత బలగాల మధ్య పండుగ వేడుకలు నిర్వహించనున్నారు. పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలపై పోలీసు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఎవరిపై రంగులు చల్లవద్దని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు ఉంటాయని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ శుక్రవారం
35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలోని రెండవ శుక్రవారం ఒకే రోజు రావడంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్ నిర్వహించాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ డీసీపీ చైతన్యకుమార్ సమావేశంలో పాల్గొన్నారు.
కమిషనర్ సీపీ ఆనంద్ నిన్న పాతబస్తీలో పర్యటించారు. హోలీ సందర్భంగా ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో దహనం కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పాతబస్తీలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. శాంతియుత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఈ రోజు సెలవు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు మద్యం షాపులు కూడా బంద్. అంతేకాకుండా చికెన్, మటన్ షాపులు కూడా బంద్ పాటించాలని నిన్న సీవీ ఆనంద్ ఆదేశించారు.