Pomegranate: దానిమ్మ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే మార్కెట్‌లో వీటిని కొనుక్కొని ఇంటికి వెళ్లి చూస్తే చాలా సార్లు వగరుగా, చప్పగా అనిపిస్తుంది. దీంతో డబ్బులు వృథాగా పోవడమే కాకుండా ఆ పండ్లను కూడా తినకుండా అయిపోతుంది. అందుకే దానిమ్మను కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తిపి ఎక్కువగా ఉండే పండ్లను ఈజీగా గుర్తి్ంచొచ్చని నిపుణులు చెబుతున్నారు. తియ్యగా ఉండే దానిమ్మను ఎలా గుర్తించాలంటే..
కలర్:
పండ్లు తీసుకున్నప్పుడు ముందుగా వాటి రంగును చూడాలి. దానిమ్మ పండ్ల విషయంలో అయితే ఎక్కువగా ఎరపు రంగు ఉండే పండ్లను తీసుకోవడమే మంచిది. పండు ఎంత ఎర్రగా ఉంటే అంత బాగా పండిందని అర్థం.
పొట్టు:
సహజ సిద్దంగా పండిన దానిమ్మ పండ్ల పొట్టు మరీ ఎక్కువ స్మూత్‌గా ఉండదు. అక్కడక్కడ కొన్ని మచ్చలు కూడా ఉంటాయి. మచ్చలు ఉన్న పండ్లను తీసుకున్నా ఏం కాదు. కానీ, పండు మీద దెబ్బలు ఉంటే దాన్ని కొనకపోవడమే ఉత్తమం.
బరువు:
పండ్లు కొనే సమయంలో వాటి బరువును బట్టి చాలా తెలుసుకోవచ్చు. తాజాగా ఉండే పండ్లు ఎక్కువ బరువుగా ఉంటాయట. అంతేకాకుండా బరువుగా ఉండే పండ్లలో రసం ఎక్కువగా ఉందని అర్థం.
ఆకారం:
దానిమ్మ పండ్ల విషయంలో వాటి ఆకారం చాలా చెప్తుంది. ముఖ్యంగా ఎక్కువగా తియ్యగా ఉండే పండు పూర్తిగా గుండ్రంగా ఉండదట. దానిమ్మ కొంచం చదునుగా అనిపిస్తుంది. లోపల ఉండే గింజలు పండు తొక్కకు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తాయట. అందుకే పూర్తిగా గుండ్రంగా ఉండే పండ్లను కొనకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అయితే పండ్లను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండాలంటే వాటిని చల్లటి వాతావరణంలో ఉంచడం మంచిది.