Buying Chicken in Summer: వేసవి కాలంలో మాంసం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చికెన్ కొనడం, దాన్ని నిల్వ చేయడం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల చికెన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉందట. సరైన పద్ధతులు పాటిస్తే, చికెన్‌ను సురక్షితంగా వినియోగించవచ్చని అంటున్నారు. అసలు సమ్మర్‌లో ఎలాంటి చికెన్ తీసుకోవాలి, దీన్ని ఎలా స్టోర్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవిలో చికెన్ కొనడానికి చిట్కా..!
చికెన్ కొనేటప్పుడు దాని రంగు, వాసన వంటి వాటిని చెక్ చేయడం చాలా అవసరం. తాజా చికెన్ గులాబీ రంగులో, వాసన లేకుండా, మృదువుగా ఉంటుందట. చికెన్‌కు చెడు వాసన లేదా జిగటగా ఉంటే, అది పాడైందని అర్థం.
సూపర్ మార్కెట్‌లో చికెన్ కొనుగోలు చేస్తే, ప్యాక్ చేసిన తేదీ, ఎక్స్‌పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. గడువు ముగిసిన చికెన్‌ను అస్సలు తీసుకోవద్దు.
చికెన్ షాప్‌లో చల్లగా ఉండే ప్రదేశంలోనే చికెన్ నిల్వ చేసి ఉంటే దాన్ని తీసుకోవాలి. ఎండలో లేదా రద్దీలో ఎక్కువ సమయం ఉంచిన చికెన్ కొనకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చికెన్‌ను ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఐస్ ప్యాక్‌లు లేదా కూలర్ బ్యాగ్‌ను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వేడి వాతావరణంలో చికెన్ పాడవకుండా ఇది కాపాడుతుందట.
వేసవిలో చికెన్ పాడవుతుందా?
వేసవిలో ఉష్ణోగ్రతలు 30-40°C మధ్య ఉంటాయి. అంత వేడిలో ఎక్కువగా సాల్మొనెల్లా, ఇ.కోలి వంటి బ్యాక్టీరియాలు పెరిగిపోతాయట. అందుకే చికెన్‌ను 4°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో 1-2 గంటల కంటే ఎక్కువ ఉంచితే, అది పాడవుతుంది.
పాడైన చికెన్‌ను గుర్తించడమెలా?
పాడైన చికెన్‌కు చెడు వాసన, జిగట, రంగు మార్పు (బూడిద లేదా పసుపు రంగు), మచ్చలు కనిపిస్తాయట. అలాంటి చికెన్‌ను వండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాడైన చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఇలా స్టోర్ చేయొచ్చు..
చికెన్‌ను 4°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిదట. ఇలా చేస్తే 1-2 రోజుల వరకు చికెన్ తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వెంటనే వండకపోతే, చికెన్‌ను ఫ్రీజర్‌లో -18°C వద్ద నిల్వ చేయాలట. దీని వల్ల దాదాపు 6-9 నెలల వరకు చికెన్ ఫ్రెష్‌గా ఉంటుందట.
చికెన్‌ను ఇతర ఆహార పదార్థాల నుండి వేరుగా నిల్వ చేయడం మంచిది. ఎందుకంటే దీని నుండి బ్యాక్టీరియా ఇతర ఆహారాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో ఇతర ఆహార పదార్థాలు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండాలంటే చికెన్‌ను కొన్న తర్వాత వెంటనే ఇంటికి తీసుకెళ్లి, రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.