Body Overheat: కొందరికి శరీరంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత మరింత పెరగడం సహజమే. కానీ, అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబతున్నారు. అందుకే దీని నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో శరీర వేడిని తగ్గించుకోవడం ఈజీ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసం వీళ్లు చెప్తున్న టిప్స్ ఏంటంటే..
వేడి వల్ల శరీరంలోని నీరు త్వరగా బయటకు వెళ్తుందట. అందుకే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నీరు మాత్రమే కాకుండా, మజ్జిగ, పండ్ల జ్యూస్‌లు, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు కూడా తాగితే శరీరంలో వేడి తగ్గుతుందట.
ఒక గ్లాస్ చల్లటి నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె, పుత్తినాకు కలిపి తాగితే శరీర వేడి తగ్గిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వెంటనే శక్తి కూడా పొందడానికి ఇది హెల్ప్ చేస్తుందట. ఇది ఒక సహజ కూలింగ్ డ్రింక్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో నీటి శాతం ఎక్కువ ఉండే ద్రాక్ష, తరబూజ, ఖర్బూజ, మామిడి వంటి పండ్లు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందట. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోవడం ఉత్తమం.
ఇప్పటికే శరీరంలో ఎక్కువగా వేడి ఉన్న వారు కొన్ని రకాల జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో తలపై స్కార్ఫ్ లేదా టోపీ ధరించాలట. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో బయటకు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: మడమలు పగిలిపోయాయా..?
శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో మసాలా ఎక్కువగా ఉండే తీవ్రమైన ఆహారం తీసుకోకూడదట. ముద్ద అన్నం, పెరుగు, కూరగాయలతో చేసిన తేలికపాటి ఆహారం తీసుకుంటే శరీరంలో వేడి పెరగకుండా ఉంటుందట. పెరుగు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
కాటన్ బట్టలు వేసవి వేడి నుండి ఉపశమనం ఇస్తాయి. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూడా ఇవి సహాయపడతాయట. ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే గోధుమ రంగు లేదా తెల్లటి రంగు దుస్తులు వేసుకుంటే ఎక్కువ వేడిగా అనిపించదు.
అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించేందుకు రోజ్ వాటర్ కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ముఖానికి రాసుకుంటే చల్లదనం కలుగుతుందట. ఇది శరీరానికి లోపల నుండి కాకుండా బయట కూడా వేడి తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.