జపాన్ లో కొత్తగా ఒక ఫిట్ నెస్ క్రేజ్ వచ్చి పడింది. అది 30 నిమిషాల పాటు నడిచే ఒక వాకింగ్ స్టైల్. దశాబ్దాలుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ వాకింగ్ స్టైల్ గురించి అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు. అప్పటినుంచి జపాన్ యువత ఇలా కొత్తగా నడిచేందుకే ఇష్టపడుతోంది.
శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ నడకనో జపనీస్ వాకింగ్ అని పిలుస్తారు. అలాగే ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ అని కూడా అంటారు. టిక్ టాక్ లో ఈ పేరుతోనే వైరల్ అయింది. ఈ కొత్త నడక పద్ధతి జపాన్లోని విషు విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్తలు ఈ వ్యాయామ నియమావళిని రూపొందించారు.
జపాన్ నడిచే పద్ధతి ఇదే
జపాన్ నడక పద్ధతిలో మూడు నిమిషాల పాటు వేగంగా ఎవరితోనూ మాట్లాడకుండా నడవాలి. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు సాధారణంగా నడవాలి. ఇలా 30 నిమిషాలు పాటు చేయాలి. అంటే మూడు నిమిషాలు అతివేగంగా నడవడం, మూడు నిమిషాలు సాధారణ నడక.. ఆ తర్వాత తిరిగి వేగంగా నడవడం ఇలా మార్చుకుంటూ అరగంట పాటు చేయాలి. వారానికి నాలుగు సార్లు ఇలా నడిస్తే చాలు.. ఎంతో మంచి ఫలితాలు కనిపిస్తాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2007లో తొలిసారి జపాన్ పరిశోధకులు ఈ టెక్నిక్ శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ప్రారంభ పరీక్షలను నిర్వహించారు. ఐదు నెలల ట్రయల్ లో రెండు గ్రూపులు వారు పాల్గొన్నారు. ఒకే పద్ధతిలో స్థిరమైన వేగంతో నడిచే గ్రూపు ఒకటి, మరొకటి ఇలా జపాన్ పద్ధతిలో ఇంటర్వెల్ వాకింగ్ చేసే గ్రూపు.
ఎవరైతే జపాన్ పద్ధతిలో ఇంటర్వెల్ వాకింగ్ చేశారో వారిలో మెరుగైన ఏరోబిక్ సామర్థ్యం, బలమైన తొడ కండరాలు, తక్కువ రక్తపోటు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అలాగే వారిలో బరువు కూడా త్వరగానే నియంత్రణలోకి వచ్చినట్టు కనిపెట్టారు. వారిలో కొలెస్ట్రాల్, బిఎంఐ వంటివి కూడా అదుపులోకి వచ్చాయని అధ్యయనాలు తేల్చాయి.
కొవ్వు కరిగిపోతుంది
జపాన్ పద్ధతిలో ఇంటర్వ్యూ వాకింగ్ చేస్తే కొవ్వు త్వరగా కరిగిపోతుంది. దీనివల్ల బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది. క్రమం తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అయితే జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీల బర్నింగ్ కూడా పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. ఇది మానసిక శ్రేయస్సు కూడా ఎంతో మేలు చేస్తున్నట్టు గుర్తించారు. జపాన్ నడక పద్ధతి పాటిస్తే శరీరంలో ఎండార్పిన్లు అధికంగా విడుదలవుతున్నాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గించే అనుభూతిని అందిస్తున్నాయి.
అంతేకాదు ఈ ఇంటర్వెల్ నడక అనేది రోగనిరోధక శక్తిని కూడా ప్రేరేపిస్తున్నట్టు గుర్తించారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు నిద్రా నాణ్యతను మెరుగుపరుస్తోందని కనిపెట్టారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గుండె పనితీరు కాపాడుకోవడానికి ఈ వాకింగ్ స్టైల్ ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచి అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని వివరిస్తున్నారు. ఎవరైతే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ జపాన్ నడక పద్ధతిని పాటిస్తే వారికి ఉత్తమ ఫలితాలు దక్కే అవకాశం ఉంది.
ప్రతిరోజు 10వేల అడుగులు నడిచే సంప్రదాయ పద్ధతి కన్నా.. ఇలా జపాన్ స్టైల్ లో ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి నడిచే స్టైల్ లో వాకింగ్ చేస్తే శారీరకంగా ఎన్నో ఫలితాలు దక్కుతాయని, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో నడిచిన వారిలో కార్డియో ఫిట్నెస్ 29 రెట్లు, కాలిలో బలం 10 రెట్లు మెరుగుదల కనిపించినట్టు వారు వివరిస్తున్నారు.