Turmeric Milk: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పసుపు పాలు (గోల్డెన్ మిల్క్) ఒక ముఖ్యమైన డ్రింక్. తరతరాలుగా మన పెద్దలు దీనిని రాత్రి పడుకునే ముందు తాగేవారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే క్రియాశీలక పదార్థం, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పసుపులో ఉండే కర్కుమిన్, పాలలో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. మంచి నిద్రకు సహాయపడుతుంది:
పసుపు పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని చాలామందికి తెలుసు. పాలు సహజంగా శరీరానికి ప్రశాంతతను అందిస్తాయి. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్, సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సహాయ పడుతుంది. ఇవి నిద్రను ప్రేరేపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పసుపులోని కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించి.. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఫలితంగా.. నిద్ర లేమి సమస్య ఉన్నవారికి ఇది ఒక మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
3. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది:
పసుపులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్లలో వచ్చే వాపు , నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు పాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.
4. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది:
పసుపు జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారిస్తుంది. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల మరుసటి రోజు ఉదయం జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.
5. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
పసుపు కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయ పడుతుంది. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి.
Also Read: ఆపిల్ Vs అరటిపండు.. వేటిలో పోషకాలు ఎక్కువ ?
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఒక గ్లాసు పాలు తీసుకుని.. అందులో ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. దీనిని బాగా మరిగించి, వేడిగా లేదా గోరు వెచ్చగా తాగవచ్చు. రుచి కోసం ఒక చిటికెడు మిరియాల పొడి, తేనె లేదా బెల్లం కూడా కలుపు కోవచ్చు. మిరియాల పొడి కలపడం వల్ల పసుపులో ఉండే కర్కుమిన్ శరీరం సులభంగా గ్రహిస్తుంది.
రాత్రి నిద్ర పోవడానికి ఒక గంట ముందు పసుపు పాలు తాగడం ఉత్తమం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.