Cycling: సైక్లింగ్ అంటే అందరికి అందుబాటులో ఉండే సులభమైన వ్యాయామం. ఇది శరీరానికి, మనసుకి ఎన్నో లాభాలను ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అన్ని వయసుల వారికీ సులభమైన వ్యాయామం. కానీ, గుండె సమస్యలు ఉన్నవారు సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందా అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సైక్లింగ్‌కి దూరంగా ఉండాలా లేదా అనేది ఇఫ్పుడు తెలుసుకుందాం..
సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు
సైక్లింగ్ గుండె, లంగ్స్, రక్త ప్రవాహాన్ని సక్రమంగా చేసి బీపీ, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం సైక్లింగ్ గుండెకి ఆక్సిజన్ బాగా అందేలా చేసి దాని పనితీరును మెరుగుపరిచి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 50% వరకు తగ్గిస్తుంది.
సైక్లింగ్ శరీరంలోని క్యాలోరీలను కరిగించి బరువును అదుపులో ఉంచుతుంది. సాధారణ వేగంతో సైకిల్ తొక్కితే గంటకి 400-600 కెలోరీలు కరుగుతాయి, ఇది వ్యాయామం తీవ్రత శరీర బరువును బట్టి మారుతూ ఉంటుంది. బరువు అదుపులో ఉండడం వల్ల గుండె పై ఒత్తిడి తగ్గి షుగర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
కండరాలు కీళ్లకు మంచిది
సైక్లింగ్ కాళ్ల కండరాలను బలంగా చేసి, కీళ్లపై ఒత్తిడిని తగ్గించి, కీళ్లనొప్పులు, గాయాల నుంచి కోలుకుంటున్నవాళ్ళకి కదలికలను పెంచుతూ నొప్పిని తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది
సైక్లింగ్ ఒత్తిడి ఆందోళన కలిగించే ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. బయట సైకిల్ తొక్కడం వల్ల ప్రకృతిలోని తాజా గాలి మనసును ఉత్తేజపరిచి డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సమూహంలో సైక్లింగ్ చేయడం వల్ల సామాజిక సంబంధాలు పెరిగి మానసిక ఆరోగ్యం మరింత బలపడుతుందట.
పర్యావరణం
సైక్లింగ్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించడమే కాకుండా రోజు సైకిల్ ప్రయాణం వల్ల ఇంధన, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఆదా అవుతాయి.
హార్ట్ పేషెంట్స్ సైక్లింగ్ చెయొచ్చా?
గుండె సమస్యలు ఉన్నవారికి సైక్లింగ్ సురక్షితమా కాదా అనేది వారి ఆరోగ్య స్థితి, ఫిట్నెస్ అలాగే వైద్యుని సలహా మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.
ఇప్పటికే గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సైక్లింగ్ చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరిగా సైకిల్ తొక్కడం వల్ల రక్త ప్రవాహం పెరిగి బీపీ, రక్త నాల సమస్యలు నియంత్రణలో ఉంటాయట.
ఆరోగ్యంపై ఎఫెక్ట్?
ఎక్కువ తీవ్రతతో ఎక్కువ సమయం సైకిల్ తొక్కడం వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, అరిత్మియా వంటి గుండె సంబధిత సమస్యలు ఉన్నవారికి గుండె పై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ వ్యాయామం చేస్తే అకస్మాత్తుగా ఛాతీ నొప్పి లేదా గుండె పోటు రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: 3 రోజుల ఉపవాసం.. శరీరంలో జరిగే మార్పులు ఏంటి?
గుండె రిథమ్ సమస్యలు ఉన్నవారు తీవ్రమైన సైక్లింగ్ చేస్తే ఆ సమస్య లక్షణాలను ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు తప్పనిసరిగా సైక్లింగ్ చేయాల్సి వస్తే ఎల్లప్పుడూ గుండె స్పందన రేటును గమనిస్తూ ఉండాలి.
ఇవి తప్పనిసరి..!
సైక్లింగ్ చేయాల్సి వస్తే గుండె పనితీరు తెలుసుకోవడానికి స్ట్రెస్ టెస్ట్, ఎకోకార్డియోగ్రామ్ వంటివి చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఛాతీ నొప్పి, ఊపిరాడకపోవడం, తలతిరగడం, గుండె దడ లాంటివి వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
ఇండోర్ సైక్లింగ్ నియంత్రిత వాతావరణాన్ని ఇస్తూ రోడ్లు, వాతావరణం వల్ల వచ్చే రిస్కులను తగ్గిస్తుందట. హార్ట్ పేషెంట్స్ సైక్లింగ్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.