Pumpkin Seeds: గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుమ్మడి గింజలను తీసుకోకుండా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి గింజలు ఎవరు తినకూడదు ?
అలర్జీ ఉన్నవారు:
కొందరికి గుమ్మడి గింజలకు అలర్జీ కలిగిస్తాయి. గుమ్మడి గింజలు తిన్న తర్వాత దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గొంతులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వీటిని తినడం ఆపివేయాలి. అంతే కాకుండా డాక్టర్‌ను వైద్యుడిని సంప్రదించాలి.
తక్కువ రక్తపోటు (లో బీపీ) :
గుమ్మడి గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే.. ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గి, సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. అలాంటి వారు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు:
గుమ్మడి గింజలు గర్భిణీలకు లేదా పాలిచ్చే తల్లులకు హానికరం అని స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ కొందరికి ఇవి సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి.. గర్భిణీలు గుమ్మడి గింజలను తీసుకునే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు:
గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియకు సహాయ పడుతుంది. అయితే.. అధిక మొత్తంలో వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు వీటిని తినడం అంత మంచిది కాదు. అతిగా తినడం వల్ల జీర్ణంకాని పదార్థాలు పేరుకుపోయే అవకాశం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
బరువు తగ్గాలనుకునేవారు (అతిగా తీసుకుంటే):
గుమ్మడి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు వీటిని మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజుకు 30 గ్రాములకు మించి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: నేరేడు పండ్లు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలు అస్సలు రావు
చిన్న పిల్లలు:
చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి వారి గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందుకే.. చాలా చిన్న పిల్లలకు వీటిని ఇవ్వకపోవడమే మంచిది లేదా వాటిని పొడిగా చేసి ఆహారంలో కలపవచ్చు.
గుమ్మడి గింజలు చాలా పోషకాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే.. ఏదైనా ఆహారం లాగే.. వాటిని కూడా మితంగా తీసుకోవడం ముఖ్యం. పైన పేర్కొన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే.. గుమ్మడి గింజలను మీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.