Swastika symbol: స్వస్తిక్ గుర్తు గురించి చెప్పనక్కర్లేదు. విజయానికి మారు పేరుగా చెబుతారు. మతపరమైన గుర్తు మాత్రమే కాదు.. శుభం, శ్రేయస్సు వాటికి ప్రతీకగా భావిస్తుంటారు. వాస్తు నుంచి జ్యోతిష్య శాస్త్రం వరకు ఈ గుర్తు వాడకుండా ఏ పని చేయరు పండితులు. పురాతన కాలం నుంచే దేవాలయాలు, గృహ ప్రవేశాలు, పూజలు, వివాహాల్లో ఈ గుర్తు వేసే సంప్రదాయం కొనసాగుతోంది కూడా. సనాతన ధర్మంలో స్వస్తిక్ అత్యంత పవిత్రమైన చిహ్నంగా పరిగణిస్తారు. సంస్కృతంలో దీనికి శుభప్రదం అని అర్థం వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. స్వస్తిక్‌కు ఇరువైపులా రెండు సరళ రేఖల మాదిరిగా గీతలు ఉంటాయి. వాటికి లోతైన మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని అంటున్నారు.
స్వస్తిక్ గుర్తుకు రెండువైపులా ఉన్న గీతలు జీవితంలోని నాలుగు ప్రాథమిక లక్ష్యాలను సూచిస్తాయని చెబుతున్నారు పండితులు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. అందులో ధర్మం అంటే సరైన మార్గాన్ని అనుసరించడం మొదటిది. అర్థం అంటే పని చేసి డబ్బు సంపాదించడం రెండోది. కామం అంటే కోరికల నెరవేర్చడం కాగా, మోక్షం అంటే అంతిమ విముక్తికి మార్గంగా చెబుతున్నారు. మానవులు నాలుగు లక్ష్యాలను సమతుల్యంగా అనుసరించాలన్నది ఆయా గీతల సారాంశం. కేవలం ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించడం జీవితాన్ని అసంపూర్ణంగా వదిలేస్తున్న రోజులు ఇవి.
స్వస్తిక్ పక్కన గీతలకు నాలుగు వేదాలతో సంబంధం ఉందని చెబుతున్నారు. వాటిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు హిందూమతానికి మూల స్తంభాలు. వేదాల్లో ధార్మిక ఆచారాలు, మంత్ర పఠనం, ఆరోగ్య జ్ఞానం, జీవితాన్ని మధురంగా మార్చే బోధనలున్నాయి. స్వస్తికపై గీతలు గీయడమంటే వేదాల్లోని జ్ఞానాన్ని స్వీకరించడం అన్నమాట. దాన్ని జీవితంలో అనుసరించాలని సూచిస్తుంది. ఆధ్యాత్మిక-ఆచరణాత్మక అంశాలను బలపరుస్తుంది.
దిక్కులతోపాటు నాలుగు యుగాలను అందులో ఉంటాయని చెబుతున్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే నాలుగు దిక్కులు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాలను ప్రస్తావిస్తున్నారు పండితులు. స్వస్తిక్‌లోని గీతలు కూడా వాటికి ప్రతీకలుగా చెబుతున్నారు. వాస్తు శాస్త్రం నుండి చూస్తే స్వస్తిక్ అత్యంత ప్రయోజనకరమైనది. నాలుగు దిక్కుల్లోనూ సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. ఇంట్లో స్వస్తిక్ వేయడం వల్ల పరిసరాలు స్వచ్ఛంగా, శుభప్రదంగా ఉంటాయి.
స్వస్తిక మధ్య భాగాన్ని విష్ణుమూర్తి నాభిగా భావిస్తుంటారు. ప్రతిరోజూ స్వస్తిక మధ్య భాగాన్ని దర్శించడం వల్ల ఆ రోజు విజయం, శుభప్రదంగా గడుస్తుందని చెబుతారు. కొన్ని మత గ్రంథాలలో స్వస్తిక్‌ను గణేశుని రూపంగా వర్ణించారు. ఇరువైపులా ఉన్న రెండు గీతలు కుమారులు శుభ్-లాభ్‌కు, భార్యలైన రిద్ధి-సిద్ధికి ప్రతీకగా నిలుస్తాయి. ఏ శుభకార్యం, పూజ అయినా సాధారణంగా స్వస్తిక్ గీసి వాటితో పూజించడంతో ప్రారంభిస్తారు.
ALSO READ: ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
స్వస్తిక్ గీతలను గీసినప్పుడు అది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. తలక్రిందులుగా లేకుంటే అసంపూర్తిగా గీసినా స్వస్తిక్ ప్రతికూల శక్తి ప్రభావాన్ని పెంచుతుందని చెబుతున్నారు. గీతలతో సహా స్వచ్ఛమైన స్వస్తిక్‌ను గీయడం చాలా అవసరం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద గానీ దేవాలయం, ప్రార్థనా స్థలంలో ఉంచడం దుష్ట శక్తుల నుండి రక్షణను అందించి ఆనందం, శ్రేయస్సు మార్గాన్ని తెరుస్తుందని భావిస్తుంటారు. స్వస్తిక్ ఒక చిహ్నం కాదు, అది జీవితానికి సంబంధించిన లోతైన సందేశాలకు ప్రతీక. రెండు వైపులా గీతలు ధర్మం, జ్ఞానం, మార్గం, శ్రేయస్సును గుర్తు చేస్తాయి. సరైన భక్తి శ్రద్ధలతో వాటిని గీయడం ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మకం.