Cotton Buds: చెవులను శుభ్రం చేసుకోవడానికి కాటన్ బడ్స్ వాడటం అనేది చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే.. వైద్య నిపుణులు మాత్రం దీనివల్ల ఎన్నో నష్టాలున్నాయని.. ఇది మేలు కంటే ఎక్కువ కీడు చేస్తుందని చెబుతున్నారు. వీటిని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చెవిలో గులిమి ఎందుకు ఉంటుంది ?
చెవిలో ఉండే గులిమిని చాలా మంది మురికిగా భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ఇది మన శరీరంలోని ఒక సహజమైన రక్షణ వ్యవస్థ. గులిమిని లాటిన్ భాషలో ‘సెరుమెన్’ (అంటారు.
ధూళి, సూక్ష్మ క్రిములను అడ్డుకోవడం: గాలిలోని దుమ్ము, ధూళి రేణువులు, సూక్ష్మ క్రిములు చెవి లోపలికి వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది.
వ్యాధులను నివారించడం: గులిమిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చెవిలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
తేమను కాపాడటం: ఇది చెవి లోపలి చర్మాన్ని పొడిబారకుండా కాపాడి, దురద వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
మన దవడ కదలికల వల్ల (నమలడం, మాట్లాడటం), పాత గులిమి నెమ్మదిగా బయటకు వస్తుంది. కాబట్టి చెవి సహజంగానే శుభ్రపడుతుంది.
కాటన్ బడ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు:
గులిమిని లోపలికి నెట్టడం: కాటన్ బడ్స్ వాడటం వల్ల చెవిలోని గులిమి బయటకు రాదు. బదులుగా.. ఇది ఇంకా లోపలికి, కర్ణభేరి వైపుకు నెట్టబడుతుంది. దీనివల్ల గులిమి గట్టిపడి, చెవి పూర్తిగా మూసుకుపోవచ్చు. దీనిని ‘ఇంపాక్టెడ్ వ్యాక్స్’ అంటారు. ఇది వినికిడి లోపానికి, చెవిలో నొప్పికి, గింగురుమని శబ్దం రావడానికి కారణమవుతుంది.
కర్ణభేరికి హాని: చెవి లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుంది. కాటన్ బడ్స్ పొరపాటున లోపలికి గట్టిగా వెళ్తే.. అది కర్ణభేరికి ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి, చెవిలో రక్తం రావడం, వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ నష్టం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా ఉంటుంది.
ఇన్ఫెక్షన్లు: కాటన్ బడ్స్ చెవి లోపలి చర్మాన్ని తాకి, చిన్నపాటి గాయాలు చేస్తాయి. ఈ గాయాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు (ఉదాహరణకు, స్విమ్మర్స్ ఇయర్) రావచ్చు.
చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి ?
సాధారణంగా చెవులను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. చెవి బయటి భాగంలో కనిపించే గులిమిని శుభ్రమైన, తడి గుడ్డతో సున్నితంగా తుడస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు చెవిలో గులిమి ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, చెవి మూసుకుపోయినట్లు అనిపించినా.. సొంతంగా శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించకుండా డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. నిపుణులు సురక్షితమైన పరికరాలను ఉపయోగించి గులిమిని తొలగిస్తారు.