ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో త్వరగా ఆకలి వేయదు. తిన్నది కూడా సరిగా అరగదు. ఒక పూట తింటే రెండో పూట తినాలనిపించదు. ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలుసుకున్నారా? ఇలా ఆకలి వేయకుండా ఉండడం వల్ల తినడం మానేస్తారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. తిరిగి శీతాకాలంలో ఆకలి వేసేలా ఎలా చేయాలో ఆయుర్వేదం చెబుతోంది.
చల్లటి వాతావరణంలో ఎంతో మందికి ఆకలి తగ్గిపోతుంది. తినాలన్న కోరిక పుట్టదు. దీంతో ఒక పూట భోజనం చేసి రెండో పూట భోజనం మానేస్తారు. దీనివల్ల పోషకాహార లోపం త్వరగా వచ్చేస్తుంది. చలికాలంలోనే ఎక్కువగా పోషకాహార లోపం కేసులు బయటపడుతూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం కాలం మారుతున్న కొద్దీ దోషాల అసమతుల్యత పెరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాత దోషం కలుగుతుంది. అంటే చల్లని, పొడిగా ఉండే లక్షణాలు అధికమవుతాయి. ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల ఆకలి కోల్పోవడం వంటివి జరుగుతుంది. అలాగే జీవక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం దోషాల మధ్య సమతుల్యతను తిరిగి పొందడానికి ఆకలని ప్రేరేపించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఆయుర్వేద ప్రకారం జీర్ణవ్యవస్థ అగ్ని వల్ల నియంత్రణలో ఉంటుంది. చల్లని వాతావరణం జీర్ణాగ్నిని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. దీని ఫలితంగానే జీర్ణక్రియ సవ్యంగా సాగదు. ఎక్కువసేపు ఆహారం జీర్ణం అవుతూ ఉంటుంది. పేగు కదలికలు నెమ్మదిగా ఉంటాయి. దీని వల్లే ఆకలి తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే బరువు కూడా పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలి.
ఆయుర్వేదంలో పంచకర్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది ప్రసిద్ధ నిర్విషికరణ ప్రక్రియ. ఇది జీర్ణవ్యవస్థ నుండి అమా దోషాన్ని తొలగించడానికి, అగ్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకి తొలగిస్తుంది. దీనివల్ల చల్లని వాతావరణంలో కూడా ఆకలి తిరిగి కలుగుతుంది.
ఆయిల్ మసాజ్
ఆయుర్వేదంలో ఆయిల్ మసాజ్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శరీరానికి నూనెను పట్టించి మసాజ్ చేయించుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇది భారతదేశాన్ని శాంతపరుస్తుంది. శరీరమంతా రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలోని దోషాలన్నీ సమతుల్యం అవుతాయి. జీర్ణక్రియకు సహాయ పడడంతో పాటూ, నాడీ వ్యవస్థను ఉపశమనం చేస్తాయి.
మానసిక ఒత్తిడి కూడా శీతాకాలంలో ఆకలిని అణిచివేస్తుంది. కొబ్బరినూనె లేదా ఉసిరి నూనె ఇలాంటి మూలిక నూనెలను కొంచెం వెచ్చగా చేసుకుని నుదుటిపై మర్దనా చేసుకోవాలి. ఇది నాడీ వ్యవస్థ పై ప్రశాంత ప్రభావాన్ని చూపిస్తుంది. విశ్రాంతి కలిగేలా చేస్తుంది. ఈ మానసిక ప్రశాంతత, సానుకూలంగా జీర్ణక్రియ జరిగేలా చేసి ఆకలి వేసేలా చేస్తుంది.
యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల కూడా ఆకలి మెరుగుపడుతుంది. చలి వాతావరణంలో ఆకలి కోల్పోవడం, బరువు పెరగడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని పైన చెప్పిన చిన్న చిట్కాల ద్వారా నివారించుకోవచ్చు. అలాగే నెయ్యి వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న పదార్థాలను తినడం చాలా అవసరం. రోజుకి ఒక స్పూను నెయ్యిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది కూడా శరీరంలో మీకు కదలికలను పెంచుతుంది. ఆకలిని మెరుగుపరుస్తుంది.
Also Read: మన శరీరంలో ఏ భాగానికి చలి ఎక్కువగా వేస్తుందో తెలుసా?
చాలామంది ఆకలి లేదు కాబట్టి తినడం వృధా అనుకుంటారు. ఆకలి లేదని ఆహారం తినడం మానేస్తే అవయవాలకు అందాల్సిన పోషకాలు అందవు. రక్తప్రసరణ కూడా సవ్యంగా జరగదు. దీనివల్ల ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు వంటివి సరిగా అందక అవి నీరసపడతాయి.