Grow Garlic Plant At Home| వంటల్లో వెల్లుల్లి లేకపోతే చాలా వంటకాల రుచే మారిపోతుంది. పప్పు, కూరలు, పచ్చళ్లు ఇలా ఎన్నో వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తుంటాం. అయితే ప్రతిసారీ మార్కెట్కు వెళ్లి వెల్లుల్లి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఒక చిన్న కుండీలో కేవలం ఒక్క వెల్లుల్లి రెబ్బతో పెద్ద మొక్క పెంచుకోవచ్చు. దీనికి పెద్ద తోట అవసరం లేదు. కొద్దిగా మట్టి, ఒక కుండీ, సరైన సూర్యరశ్మి ఉంటే చాలు. మరి ఇంట్లోనే తాజా వెల్లుల్లి ఆ ప్రక్రియ వివరాలు చూద్దాం.
వెల్లుల్లి మొక్కను పెంచడానికి ముందుగా మంచి రెబ్బను ఎంచుకోవాలి. పెద్దగా, గట్టిగా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్న రెబ్బను తీసుకోవాలి. మెత్తగా ఉన్నవి, కుళ్లినవి లేదా ఎండిపోయిన రెబ్బలు ఉపయోగించకూడదు. రెబ్బపై ఉండే పలుచని పొట్టును తొలగించకూడదు. ఇది మొక్క పెరిగే సమయంలో రెబ్బకు రక్షణగా ఉంటుంది. వెల్లుల్లి గడ్డ నుంచి రెబ్బను వేరు చేసిన వెంటనే నాటడం మంచిది.
వెల్లుల్లి పెంచడానికి కనీసం 8 నుంచి 10 అంగుళాల లోతు ఉన్న కుండీ ఎంచుకోండి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు ఉండాలి. మట్టిని సిద్ధం చేసేటప్పుడు తోట మట్టిలో కొద్దిగా పాత సేంద్రియ ఎరువు కలపాలి. అలాగే ఇసుక లేదా కోకోపీట్ కలిపితే నీరు సులభంగా బయటకు వెళ్తుంది. మట్టి గుల్లగా, పోషకాలతో నిండి ఉండాలి.
ముందుగా కుండీలో 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో చిన్న గుంత చేయండి. వెల్లుల్లి రెబ్బ మొన భాగం పైకి ఉండేలా నాటాలి. తర్వాత మట్టితో పూర్తిగా కప్పాలి. ఒకే కుండీలో ఎక్కువ రెబ్బలు నాటాలనుకుంటే వాటి మధ్య తగినంత దూరం ఉంచాలి. ఇలా చేస్తే ప్రతి మొక్కకు ఎదగడానికి అవసరమైన స్థలం లభిస్తుంది.
వెల్లుల్లి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం ఆరు గంటల పాటు ఎండ తగిలే ప్రదేశంలో కుండీని ఉంచాలి. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ ఇందుకు అనువుగా ఉంటుంది.
మొక్క పెరిగే సమయంలో మట్టిలో కొద్దిగా తేమ ఉండాలి. అయితే ఎక్కువ నీరు పోస్తే రెబ్బ కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టి పైపొర ఎండినప్పుడు మాత్రమే నీరు పోయాలి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
Also Read: రోజుకు 10,000 అడుగులు వాకింగ్ చేయడం మంచిది.. ఆఫీసులో 9 గంటలు డెస్క్ జాబ్ చేసేవారు ఎలా చేయాలి?
సాధారణంగా వెల్లుల్లి పంట చేతికి రావడానికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభిస్తే కోతకు సిద్ధమవుతున్నట్లు గుర్తించాలి. మొక్కను జాగ్రత్తగా బయటకు తీసి వెల్లుల్లి గడ్డలు సేకరించాలి.
Also Read: రోజూ ఆఫీస్ వెళ్లేందుకు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే
కోత తర్వాత గడ్డలకు అంటుకున్న మట్టిని తొలగించాలి. వెంటనే కడగకుండా, గాలి బాగా ఆడే నీడ ఉన్న ప్రదేశంలో కొన్ని రోజులు ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే పండించిన తాజా వెల్లుల్లిని ఉపయోగించుకుంటే వంటల్లో కూడా రుచి, తాజాదనం ఉంటుంది.