Industry Pressure: గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాలు మరోసారి సినీ, టీవీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ‘కుంకుమ్ భాగ్య’ వంటి ప్రముఖ హిందీ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన 22 ఏళ్ల యువ నటి సంచిత ఉగాలే ఇటీవల ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రముఖ నటి, ‘రోడీస్’ విజేత ఆంచల్ ఖురానా తీవ్రంగా స్పందించారు. నటీనటులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలను వివరిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read also-మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్లలోకి ‘శంకర్ దాదా M.B.B.S’ రీ-రిలీజ్!
ఆంచల్ ఖురానా ఇండస్ట్రీలో నటీనటుల దయనీయ స్థితిని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక్కడ ఛానెళ్లకు టీఆర్‌పీ (TRP) రేటింగులు కావాలి, నిర్మాతలకు బడ్జెట్ ఆదా చేసుకోవడం ముఖ్యం, ప్రేక్షకులకు కేవలం వినోదం మాత్రమే కావాలి. కానీ, ఆ వినోదాన్ని అందించే ఒక నటుడు లోపల ఎలాంటి మానసిక నరకాన్ని అనుభవిస్తున్నాడో ఎవరికీ అనవసరం” అని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో నటీనటులకు ఎలాంటి భద్రత లేదని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆంచల్ ఇండస్ట్రీలోని కొన్ని నగ్న సత్యాలను బయటపెట్టారు. “ఎవరితోనైనా పడుకోవడానికి (రాజీ పడటానికి) ఒప్పుకోకపోతే మిమ్మల్ని వెంటనే ప్రాజెక్ట్ నుండి తీసేస్తారు (రిప్లేస్ చేస్తారు). మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తూ ఎవరితోనైనా వాదించినా రిప్లేస్ చేస్తారు లేదా మీ పాత్ర నిడివిని తగ్గించేస్తారు. ప్రతి ఉదయం మేము ఎంతో భయంతో, ఒక కొత్త ఆశతో నిద్ర లేస్తాము. కేవలం వెయ్యి రూపాయల బడ్జెట్ తేడా కోసమో లేదా లొంగిపోలేదనో ఎంత మంచి నటుడినైనా సులభంగా పక్కన పెట్టేస్తారు. ఇది నా జీవితంలో కూడా జరిగింది” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఒక్కరూ ‘ధైర్యంగా ఉండు’ (Be strong) అని ఈజీగా చెబుతుంటారు, కానీ నిరంతరం పోలికలు, రిజెక్షన్ల మధ్య నలిగిపోయే నటులు ఎంతకాలం ఓపిక పట్టాలో ఎవరూ చెప్పరని ఆంచల్ అన్నారు. సహనానికి కూడా ఒక హద్దుంటుందని, ఈ ఒత్తిడిని భరించడం అందరివల్లా కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
Read also-భారత్‌లో టెలిగ్రామ్ సేవలు బంద్!.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రస్తుతం తాను కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా షూటింగులకు దూరంగా ఢిల్లీలోని తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నట్లు ఆంచల్ వెల్లడించారు. నటీనటులకు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆమె ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. “ఒత్తిడి తట్టుకోలేక జీవితం ముగిసిపోయిందని భావించినప్పుడు దయచేసి ఎవరూ ఆత్మహత్యల వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. బ్యాగు సర్దుకుని మీ సొంత ఊర్లకు, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోండి. మనం చనిపోతే ఇక్కడ నిర్మాతలకు లేదా ఛానెళ్లకు వచ్చే నష్టమేమీ లేదు, మరుసటి రోజే మన స్థానంలో వేరేవాళ్లను పెట్టుకుంటారు. కానీ కుంగిపోయేది మన కుటుంబం మాత్రమే. కాబట్టి ఎల్లప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి” అని విజ్ఞప్తి చేశారు.
సంచిత ఉగాలే అకాల మరణం పట్ల మేఘా చాపేకర్, సోరబ్ బేడీ, మేఘా శర్మ, జ్యోత్స్నా చందోలా వంటి పలువురు టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు సంతాపం ప్రకటిస్తూ.. గ్లామర్ ఇండస్ట్రీలో పెరుగుతున్న పని ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్యంపై తక్షణమే చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.