Shahrukh Khan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు షారుఖ్ ఖాన్(Shahrukh Khan).. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. గత కొద్ది రోజులుగా చేతికి గాయంతో కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కి ఏమైంది అని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన చేతికి జరిగిన గాయంపై స్పందిస్తూ అసలు క్లారిటీ ఇచ్చారు.
చేతికి గాయంపై స్పందించిన షారుఖ్ ఖాన్..
అసలు విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్’. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఆయన గాయపడ్డారట. తన చేతికి అయిన గాయం, జాతీయ అవార్డుపై ముంబైలో జరిగిన ‘ది బాట్స్ ఆఫ్ బాలీవుడ్’ ట్రైలర్ విడుదల వేడుకలో స్పందించారు. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ..” కింగ్ సినిమా షూటింగ్లో గాయపడడంతో నా భుజానికి గాయమై సర్జరీ జరిగింది. ఒకటి రెండు నెలల్లో నేను కోలుకుంటాను. అయితే జాతీయ అవార్డు అందుకోవడానికి ఒక చెయ్యి సరిపోతుంది. కానీ మీ ప్రేమను మూట కట్టుకోవడానికి మాత్రం ఒక్క చెయ్యి సరిపోదు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే చేతికి సర్జరీ అయ్యిందని, త్వరలోనే కోలుకుంటానని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు..
షారుఖ్ ఖాన్ ఇటీవల కేంద్రం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈయనతో పాటు విక్రాంత్ మాస్సే కూడా ఈ అవార్డును అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ విశేషాలు..
షారుఖ్ ఖాన్ నటించిన కింగ్ మూవీ విషయానికి వస్తే.. సినిమాలో షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేసిన సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ద్వారా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ (Suhana khan) కూడా నటిగా తన జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ కు గురువుగా నటించబోతున్నట్లు సమాచారం. రాణి ముఖర్జీ (Rani Mukherjee), దీపికా పదుకొనే (Deepika Padukone) లాంటి స్టార్స్ కూడా భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ కెరియర్..
షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న షారుక్ ఖాన్.. హిందీ సినీ పరిశ్రమలో నటుడిగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా వందకు పైగా చిత్రాలలో నటించిన ఈయన.. నేషనల్ అవార్డుతో పాటు భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ కూడా అందుకున్నారు. అంతేకాదు ఫ్రాన్స్ ప్రభుత్వం చేత ‘ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ మరియు లెజెండ్ ఆఫ్ ఆనర్’ ని కూడా అందుకోవడం జరిగింది. మొదట సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘దీవానా’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, నటుడిగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఆసియాలోనే గొప్ప నటులలో ఒకరిగా స్థానం సంపాదించుకోవడం గమనార్హం.
also read: AA22xA6: బన్నీ మూవీలో కోలీవుడ్ స్టార్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్!