Movie Piracy: పైరసీ ..పైరసీ అనే కన్నా రాకాసీ అనాలేమో ..అవును ..సినిమా మీద బ్రతికే లక్షలాది మంది భవిష్యత్ ని అమాంతం పొట్టన పెట్టుకుంటుంది మరి.పరిస్థితి ఎలా ఉందంటే సినిమా థియేటర్లలోకి వచ్చిందే ఆలస్యం కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రత్యక్షమైపోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. దీంతో నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఎప్పటి నుంచో సినీ పరిశ్రమ తమ గోడు వెళ్ళ బోసుకుంటుంది కూడా.అయితే ఇక దీనికి చరమ గీతం పాడాల్సిందే అంటూ కేంద్ర ప్రభుత్వం మరింత సీరియస్‌గా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పైరసీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ప్రభుత్వం మరింత దూకుడుగా
కేంద్ర మంత్రి సురేష్ గోపి పంపిన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. సినిమాటోగ్రాఫ్ (సవరణ) చట్టం–2023 అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ మూవీ పైరసీని అరికట్టే విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు.సినిమా లీక్ చేయడం, పైరసీ లింకులు షేర్ చేయడం, అనధికారికంగా సినిమాలను అప్‌లోడ్ చేయడం లాంటి వాటిపై ఇప్పుడు చట్టపరంగా గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యల లెక్కలు చూస్తేనే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతోంది కూడా. దేశవ్యాప్తంగా పైరసీకి సంబంధించిన 7,393 URLలను బ్లాక్ చేశారు. అంతేకాదు 1,263 పైరసీ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నారు. సినిమాలని ఎక్కువగా లీక్ చేసే4,996 టెలిగ్రామ్ ఛానళ్లను కూడా మూసివేశారు. ఇంకా ఇలాంటి నెట్‌వర్క్‌లపై నిఘా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక యాంటీ-పైరసీ పోర్టల్
ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు పైరసీ లింకులు కనిపించిన వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రత్యేక యాంటీ-పైరసీ పోర్టల్ ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని సమాచారం.అంటే ఒక్క ఫిర్యాదుతోనే సంబంధిత లింకులు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఛానళ్లపై వేగంగా చర్యలు తీసుకునే విధంగా ఈ వ్యవస్థ ఉండబోతుందన్న మాట.. అలాగే సమాచార ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ శాఖ, టెలికాం, హోంశాఖ, న్యాయశాఖ కలిసి పనిచేసేలా ప్రత్యేక అంతర్-మంత్రిత్వ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఇక గత కొన్నేళ్లుగా పైరసీ బారిన పడిన సినిమాలు చూస్తె RRR, సలార్, లియో, జైలర్, కల్కి 2898 AD, పుష్ప 2: ది రూల్, దేవర పార్ట్-1 వంటి ఎన్నో సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ బారిన పడ్డాయి. దీంతో మొదటి రోజు, మొదటి వీకెండ్ కలెక్షన్లపై ప్రభావం పడిందని అప్పట్లోనే ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి.
పైరసీ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా నేరం
ఇక కొత్త చట్టం ప్రకారం చూస్తే థియేటర్‌లో మొబైల్‌తో సినిమా రికార్డ్ చేయడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో లేదా పైరసీ గ్రూపుల్లో షేర్ చేయడం కూడా నేరం కిందికే వస్తుంది అని తెలుస్తుంది అలాంటి వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉంది. అందుకే ఇకపై థియేటర్లలో కూడా నిఘా మరింత పెంచానున్నారని సమాచారం..
మొత్తంగా ఈ చర్యలు గనుక అమల్లోకి వస్తే.. ఇకపై సినిమా రిలీజైన రోజే పైరసీ లింకులు వెతికే వారికి గట్టి షాక్ తగలడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
also read :ఒకే రోజు ఐదారు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఈ కొట్టుడేంది సామీ!