Chiranjeevi: అల్లు వారింట తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. స్వర్గీయ అల్లు రామలింగయ్య భార్య, నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) మరణించిన విషయం విదితమే. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆమె నేటి ఉదయం మృతి చెందారు. దీంతో అటు అల్లు వారింట.. ఇటు మెగా కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కనకరత్నమ్మ మృతి విషయం తెలుసుకున్న మనవడు అల్లు అర్జున్.. హుటాహుటిన ముంబైలో జరుగుతున్నా షూటింగ్ ను ఆపేసి హైదరాబాద్ చేరుకున్నాడు. రామ్ చరణ్ కూడా కొద్దిసేపటిలో అల్లు వారింటికి చేరుకోనున్నాడు. ఇక ఇప్పటికే అరవింద్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ చేరుకున్నారు. అత్తగారి మరణంపై చిరు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఆమె మరణం తమకు ఎంతో బాధను మిగులుస్తుందని చెప్పుకొచ్చారు.
“మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ దంపతులకు ఒక కొడుకు అల్లు అరవింద్, ఒక కూతురు అల్లు సురేఖ. చిరంజీవి అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో కనకరత్నమ్మే.. అతనిని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని ఆశపడిందట. అదే విషయాన్నీ అల్లు రామలింగయ్యకు చెప్పిందట. అబ్బాయి బావున్నాడు.. సురేఖకు ఈడుజోడు బావుంటుంది.. అందులోనూ మనవాడే కదా ఒకసారి అడగండి అని రామలింగయ్యను ముందుకు తోసింది ఆమె అంట. ఆ తరువాత భార్య చెప్పింది నిజమే.. ముందు ముందు ఈ కుర్రాడు స్టార్ అవుతాడని అలోచించి అల్లు రామలింగయ్య కూడా చిరునే అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. అన్ని కుదిరి చిరు – సురేఖ పెళ్లి జరిగింది.
ఇక చిరు అల్లుడు అయ్యాక.. గీతా ఆర్ట్స్ లో ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. వాటివల్ల అటు చిరు.. ఇటు గీత ఆర్ట్స్ మంచి విజయాలను అందుకొని ఒక స్థాయిలో నిలబడ్డారు. ఇకపోతే కనకరత్నమ్మ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం కోకాపేటలో జరగనున్నట్లు తెలుస్తోంది.
మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం.
మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతిః 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) August 30, 2025