Shami Wife Hasin: భారత క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన మహమ్మద్ షమీ {Mohammed Shami}.. చీర్ గర్ల్ అయిన హాసిన్ జహాన్ ను 2014లో వివాహం చేసుకున్నాడు. చాలా కాలం పాటు ప్రేమించుకున్న ఈ జోడి.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. ఈ జంటకి 2015 లో కూతురు ఐరా జన్మించింది. నాలుగు సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి దాంపత్య జీవితం.. ఆ తర్వాత కోర్టుకెక్కింది. 2018లో మొహమ్మద్ షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హాసిన్ జహన్.. షమీపై గృహ హింస కేసు పెట్టింది.
ఆ తరువాత కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుంది. ఇక విడాకులు తీసుకున్నప్పటి నుండి మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది మహమ్మద్ షమీ మాజీ భార్య. తనను భయపెట్టేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని.. కానీ ఆ బెదిరింపులకు తాను భయపడలేదని, ఎంత ఒత్తిడికైనా తలొగ్గలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎవరూ తన జీవితాన్ని నాశనం చేయలేరని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దీంతో హాసిన్ జహాన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
” పిచ్చి కుక్కలకు భయపడి ఉంటే 2018 లోనే భయపడేదాన్ని. నన్ను ఎంత భయపెట్టాలని చూసినా, నాశనం చేయాలని చూసినా.. అంతే స్థాయిలో బలపడతాను” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే ఇటీవల మొహమ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో గతం గురించి వదిలేయాలని.. వివాదాల జోలికి వెళ్లదలుచుకోవడం లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా క్రికెట్ పైనే ఉందని చెప్పుకొచ్చాడు షమీ. ఈ నేపథ్యంలో హాసిన్ జహాన్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఇక ఉత్తరప్రదేశ్ కి చెందిన కుడిచేతి వాటం పేస్ బౌలర్ మహమ్మద్ షమీ దేశీ క్రికెట్ లో బెంగాల్ కి ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ జట్టులో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన మహమ్మద్ షమీ.. భారత పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్ లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 64 టెస్ట్ లు, 108 వన్డేలు, 25 టీ-20 మ్యాచ్ లు ఆడిన మహమ్మద్ షమీ.. టెస్టుల్లో 229 వికెట్లు, వన్డేల్లో 206, టి-20 ల్లో 27 వికెట్లు పడగొట్టాడు.
Also Read: BCCI president: బీసీసీఐకి కొత్త బాస్.. ఇక టీమిండియాలో పెను మార్పులు ?
చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమ్ ఇండియాకు ఆడిన మహమ్మద్ షమీ.. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2025 టోర్నీలో బిజీగా ఉన్నాడు. ఇక షమీ కూతురు ఐరా ప్రస్తుతం తల్లి సంరక్షణలో పెరుగుతోంది. కూతురి సంరక్షణ కోసం భరణం కింద ప్రతి నెల నాలుగు లక్షలు ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మహమ్మద్ షమీపై అతడి మాజీ భార్య నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది.