Neil Breen Movies: ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ నుంచి యాక్టర్స్ వరకు ఎంతో మంది పని చేయాల్సి ఉంటుంది. సినిమా రెడీ అయ్యే వరకు వందలాది మంది కష్టపడాల్సి ఉంటుంది. అయితే, ఇదంతా సాధారణ వ్యక్తుల గురించి.. కానీ, నీల్ బ్రీన్ వెరీ స్పెషల్. ఒక్కరే అన్నీ పనులు చేసుకుంటారు. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్, యాక్టర్ వరకు అన్నీ తానై సినిమాను తెరకెక్కిస్తారు. ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి మంచి స్పందన లభిస్తుంది.
ఎవరీ నీల్ బ్రీన్?
65 ఏళ్ల నీల్ బ్రీన్ అమెరికన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్, ఎడిటర్, యాక్టర్.. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఒక్కరే. తక్కువ బడ్జెట్ చిత్రాలకు కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అతడి సినిమాలు అసాధారణ కథాంశాలతో తెరకెక్కుతాయి. మాయా శక్తి కలిగి హ్యాకర్, సైబర్ టెర్రిస్టులు, అతీంద్రియ జీవి భూమిని సందర్శించడం, ఏఐ మాయ, ఒకే వ్యక్తి రెండు వెర్షన్ల కథ సహా భిన్నమైన స్టోరీలతో సినిమాలను తెరకెక్కించారు. నీల్ బ్రీన్ తన సినిమాల్లో దాదాపు అన్ని పనులు తానే చేసుకంటారు. నిర్మాణం, దర్శకత్వం, నటన, ఎడిటింగ్, మ్యూజిక్ సహా అన్ని బాధ్యతలు తానే నిర్వహిస్తారు. ఆయన సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మించబడుతాయి. ఇందులో చాలా వరకు గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. స్టాక్ ఫుటేజ్, అసాధారణ డైలాగ్ లు ఉంటాయి. అతడి సినిమాలు పర్యావరణం, సామాజిక అవినీతి, అతీంద్రియ, సైన్స్ ఫిక్షన్ థీమ్ ల ఆధారంగా రూపొందాయి. ఆయనకు అమెరికా సినిమా లవర్స్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది.
తాజా సినిమా చూసి ప్రేక్షకుల నీరాజనం
తాజాగా సినిమా ఎండింగ్ లో వచ్చే క్రెడిట్ లను చాలా మంది ప్రేక్షకుల చూసేందుకు ఇష్టపడరు. కానీ, మార్వెల్ సినిమా చివరి సన్నివేశం కోసం వేచి ఉంటే తప్ప, మీరు కచ్చితంగా బ్రీన్ కృషిని అభినందించి తీరాల్సిందే. యుఎస్ లోని అట్లాంటా ప్లాజా థియేటర్ లో అతని 2023 సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘కేడ్: ది టార్చర్డ్ క్రాసింగ్’ ప్రదర్శన సందర్భంగా, ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొడుతూ ప్రశంసించారు.
రెండు పాత్రల్లో నడించిన బ్రీన్
బ్రీన్ ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రలు చేశారు. ఒకేలా ఉండే కవల సోదరులు కేడ్, కేల్ పాత్రలలో యాక్ట్ చేశారు. మొత్తం సినిమాకు దర్శకత్వం, నిర్మాణం, స్కోర్ చేయడం, ఎడిటింగ్, రైటింగ్ అన్నీ తనే చేశాడు. సంగీత దర్శకుడు, నిర్మాణ డిజైనర్, సినిమాటోగ్రాఫర్ గా అలాగే సెట్స్ కూడా తనే తగ్గరుంచి చూసుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్, లొకేషన్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, స్టంట్ కోఆర్డినేటర్ గానూ వ్యవహరించారు. లీగల్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, క్రాఫ్ట్ సర్వీసెస్ ను కూడా చూసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాను తనే అన్నీ దగ్గరుండి తెరకెక్కించారు. ఆయనతో పాటు కేవలం 15 మంది కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు.
నిజానికి బ్రీన్ రీసెంట్ గా తెరకెక్కించిన చాలా సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఆయ పట్ల ప్రేక్షకులలో తెలియని అభిమానం ఉంది. తాజా సినిమాల్లోని క్రెడిట్ లపై బ్రీన్ పేరు వచ్చిన ప్రతిసారీ అట్లాంటా సినిమా థియేటర్ లో ప్రేక్షకులు సంతోషంతో కేరింతలు కొడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: పిల్లలను కనే రోబోలు వచ్చేస్తున్నాయ్.. జస్ట్ ఇలా చేస్తే చాలు, పండంటి బిడ్డ మీ చేతిలో!