Jailer 2:సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రజనీకాంత్.. ఏడుపదుల వయసు దాటినా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అలా లేటు వయసులో సూపర్ స్టార్ రజినీకాంత్ కి మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం జైలర్. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, నెల్సన్ దిలీప్ కుమార్ మార్క్ టేకింగ్, అనిరుద్ సంగీతం తో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా.. తాజాగా మేకర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ చేసిన పోస్ట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది.
ప్రముఖ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం..” జైలర్ 2 విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెల్లడించనున్నారు”. ఈ ఒక్క ప్రకటనతోనే సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా.. వాటికి అధికారికంగా తెరపడింది. ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అనే ప్రచారం సాగుతోంది. మిగతా రోజుల్లో పోల్చుకుంటే పండుగ సీజన్లో విడుదలయితే ఆయా చిత్రాలకు ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇలా పండుగ దినాలను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ వినాయక చవితిని సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం 6:00 వరకు ఎదురు చూడాల్సిందే.
ఇకపోతే జైలర్ 2 చిత్రంపై ఈ రేంజ్ లో ఆసక్తి పెరగడానికి మరో కారణం ఇందులో నటిస్తున్న భారీ తారాగణం. రజనీకాంత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఎస్ జె సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హృతిక్ రోషన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారని సమాచారం వినిపిస్తోంది. ఏది ఏమైనా రజనీకాంత్ మళ్లీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
also read:దుల్కర్ సల్మాన్ కు చుక్కెదురు..కార్ స్మగ్లింగ్ కేసులో అలాంటి ప్రశ్నలు!
రజినీకాంత్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. కమలహాసన్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్ నిర్మిస్తున్న ధర్మన్ అనే చిత్రంలో నటిస్తున్నారు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రాలు మళ్లీ రజనీకాంత్ కు ఎలాంటి స్టార్ డం ను అందిస్తాయో చూడాలి.