Udaipur files:ఉదయపూర్ ఫైల్స్ (Udaipur files).. 2022లో ఉదయపూర్ లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య, తదనంతరం పరిణామాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ఉదయపూర్ ఫైల్స్. గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా విడుదలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. దర్శక నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సంబంధిత పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని కోరింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఒక కమిటీ ఆరు మార్పులను సూచించగా అటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా అంగీకరించింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు నేడే..
అయితే ఇప్పుడు ఈ ఉదయపూర్ ఫైల్స్ సినిమా వివాదం పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఈ విచారణ తర్వాత సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా? లేక దానిపై తాత్కాలిక స్టే కొనసాగించాలా? అనేది నిర్ణయించనున్నారు. మొత్తానికైతే ఈరోజు సుప్రీం కోర్ట్ ఇవ్వబోయే తుది తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పుల మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ప్యానెల్ నివేదికలో 6 కోతలను సిఫార్సు చేసిన కేంద్రం..
కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక కమిటీ 6 మార్పులను సూచించడం జరిగింది. మరి ఆ ఆరు కోతల విషయానికొస్తే..
1. ఒక మతాన్ని ఉద్దేశిస్తూ నూతన్ శర్మ చెప్పే డైలాగ్ ను సినిమా నుంచి తొలగించాలి.
2. క్రెడిట్ లో పొందుపరిచిన పేర్లలో ప్రత్యేకించి కొందరి వ్యక్తుల పేర్లు తొలగించాలి.
3. ఇప్పటికే ఉన్న డిస్ క్లయిమర్ ను తీసివేసి.. దానిని సిఫార్సు చేసిన డిస్ క్లయిమర్ తో భర్తీ చేయాలి.
4. తల పాగాకు సంబంధించి ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన సన్నివేశాన్ని సవరించాలి.
5. బలూచి ప్రస్తావన ఉన్న రెండు సంభాషణలను కూడా తొలగించాలి.
6. పోస్టర్ సహ అన్నిచోట్ల నూతన్ శర్మ పేరును మరో పేరుతో రీప్లేస్ చేయాలి.
ఇక ఈ ఆరు కోతలు సవరించిన తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వబోయే తుది తీర్పు పైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
ఉదయపూర్ ఫైల్స్ వివాదం ఏమిటంటే?
నిజజీవిత ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూలై 11న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలు, వివాదాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. చిత్రం విడుదల నిలిపివేయాలని జమాతే ఇ ఇస్లామి డిమాండ్ చేసింది. ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని, విడుదల అయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్వీ కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
ALSO READ:Hero Dhanush: హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఇదిగో ప్రూఫ్!