Shefali Jariwala Case: అందం అశాశ్వతం. ఏ జీవికైనా ఇది వర్తించే విషయం. వయసు పెరిగినా కొద్దీ మరణానికి దగ్గరవుతున్నట్లే. ఈ చిన్న లాజిక్స్ మర్చిపోయి మరణాన్ని కోరి తెచ్చుకునే పనులు చేస్తుంటారు. 42 ఏళ్ల నటి షెఫాలీ జరివాలా అందం కోసం, చర్మం మెరవడం కోసం, యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంది. ట్రీట్ మెంట్ ఫెయిల్ అయింది. తనువు చాలించింది. మరి మధ్యలో జరిగిందేంటి? యాంటీ ఏజింగ్ చికిత్సలు తీసుకోవడం కరెక్టేనా?
షెఫాలీ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన
ప్రముఖ యాక్టర్ కావడంతో ఆమె మరణాన్ని పోలీసులు ఈజీగా తీసుకోలేదు. ఎంక్వైరీ మొదలు పెట్టారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అంధేరీలోని ఆమె ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు అణువణువూ పరిశీలించారు. గ్లుటథియోన్, అలాగే విటమిన్ సి ఇంజెక్షన్లు, అసిడిటీ ట్యాబ్లెట్స్ గుర్తించారు. ఇవి చర్మం నిగనిగలాడేందుకు వాడే పవర్ ఫుల్ మెడిసిన్స్. దీంతో ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్ ఒక అంచనాకు వచ్చారు. ఏమీ తినకుండా, ఉపవాసం ఉండి ఈ గ్లుటథియోన్ వయల్స్ వాడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి కాకుండా ఆమె మరణానికి ఎలాంటి సస్పెక్ట్ లేదని నిర్ధారణకు వచ్చారు.
యాంటీ ఏజెంట్ ట్రీట్మెంట్ కోసం వాడకం
ఈ ఈ గ్లుటథియోన్ వయల్స్ పవర్ ఫుల్. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం వాడుతారు. వీటిని డాక్టర్ల సూచనలతో వాడాలి. అయితే సరైన డైట్ లేకపోతే ఎన్ని చర్మ సౌందర్యసాధనాలు వాడినా వేస్టే అన్నది షెఫాలీ జరివాలా ఎపిసోడ్ చూస్తే అర్థమయ్యే విషయం. ఏమీ తినక ఈ వయల్స్ వాడడంతో ఒక్కసారిగా బీపీ డౌన్ అయ్యి.. కార్డియాక్ అరెస్ట్ కు దారి తీసిందంటున్నారు. అయితే ఇందులోనూ రెండు రకాల ఆర్గుమెంట్స్ తెరపైకి వచ్చాయి. యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ తో హార్ట్ ఎటాక్ కు సంబంధం లేదంటున్నారు. ఇంకోవైపు వీటిని ఇతర మెడిసిన్స్ తో తీసుకోవడం వల్ల బాడీపై ఏదైనా ఎఫెక్ట్ పడిందేమోనన్న డౌట్లను డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.
షెఫాలీ హార్మోనల్ థెరపీలు తీసుకుంటోందా?
షెఫాలీ యాంటీ ఏజింగ్ కోసం హార్మోనల్ థెరపీలు తీసుకుని ఉంటే అవి సైడ్ ఎఫెక్టులకు దారి తీసి ఉండొచ్చన్న డౌట్లను ఇంకొంత మంది డాక్టర్లు వినిపిస్తున్నారు. చికిత్స ఏదైనా ఒక నిండు ప్రాణం బలైంది. భవిష్యత్ ఉన్న నటి 42 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. గ్లుటథియోన్ ఇంజెక్షన్లను చర్మాన్ని మెరిసేలా చేయడానికి, యవ్వనంగా కనిపించడానికి వాడుతారు. షెఫాలీ ఈ ఇంజెక్షన్లను డాక్టర్ సలహాతో నెలవారీగా తీసుకునేదా అన్న కోణంలో పోలీసుల ఎంక్వైరీ నడుస్తోంది. విటమిన్ సి ఇంజెక్షన్లను చర్మ సౌందర్యం, యాంటీ-ఆక్సిడెంట్ కోసం వాడతారు. ఇక అసిడిటీ ట్యాబ్లెట్స్ ను గ్యాస్ట్రిక్ సమస్యల కోసం వాడినట్లు పోలీసుల విచారణలో తేలిన విషయం. ఇవే కాదు.. ఫోరెన్సిక్ నిపుణులు చేసిన తనిఖీల్లో.. షెఫాలీ ఇంట్లో రెండు బాక్సుల నిండా యాంటీ ఏజింగ్ మెడిసిన్స్, అలాగే స్కిన్ గ్లో ఇంజెక్షన్లు దొరికాయి. వీటి నమూనాలను పోలీసులు ల్యాబ్ పరీక్షల కోసం పంపారు.
కాంటా లగా రీమిక్స్ సాంగ్‌తో ఫిదా
షెఫాలీకి చిన్న వయసులో మూర్ఛవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఎపిలెప్సీ మందులకు హార్ట్ ఎటాక్ కు సంబంధం లేదంటున్నారు. అందంగా కనిపించాలనుకోవడం తప్పు కాదు. కానీ అదే పనిగా వయసును తగ్గించుకునేలా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్ లు పెరగడం ఖాయమే. దీంతో వయసు పెరిగే కొద్దీ సమస్యలు మరింతగా పెరుగుతాయి. ప్రాణాలకే ముప్పుగా మారుతుంటాయి. షెఫాలీ విషయంలో కూడా ఇదే జరిగిందంటున్నారు. 2002లో వచ్చిన కాంటా లగా రీమిక్స్ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచిన షెఫాలీ జరివాలా.. ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో బాలీవుడ్ లో కాంటా లగా గర్ల్‌గా పిలవడం ప్రారంభించారు.
హిందీ బిగ్‌బాస్ 13లో షెఫాలీ ఎంట్రీ
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ముజ్ సే షాదీ కరోగీ సినిమాలో ఓ పాత్ర పోషించారు. రియాలిటీ షోల్లో షెఫాలీ పాల్గొన్నారు. హిందీ బిగ్‌బాస్ 13లో ఎంట్రీ ఇచ్చారు. మొదట మ్యుజీషియన్ హర్మీత్ సింగ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు పరాగ్ త్యాగీతో మ్యారేజ్ జరిగింది. అందంగా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు, సినిమా అవకాశాల కోసం.. ఏదో చేద్దామని షెఫాలీ అనుకుంటే ఇప్పుడు నిండు ప్రాణమే బలైంది. అందంకోసం తీసుకున్న ట్రీట్మెంటే బలి తీసుకుందా? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంత డేంజరా..? పెరిగే వయసును అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రకృతికి విరుద్ధమా?
మంచి ఫుడ్, మంచి ఆలోచనలు, మంచి నిద్ర, మంచి ఎక్సర్ సైజులు, పీస్ ఆఫ్ మైండ్.. ఇవన్నీ మన వయసును సహజంగానే బయటకు కనిపించవు. వృద్ధాప్యాన్ని అంత త్వరగా దరి చేరనివ్వవు. కానీ ఇవేవీ లేకుండా బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకోవడం, వయసును రివర్స్ చేసే పనులతో మొదటికే మోసం వస్తోంది. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే చాలా ఘటనలు జరిగాయి కూడా. అయినా సరే అందం కోసం, మంచిగా కనిపించడం కోసం బాహ్య సౌందర్యం కోసం వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
నేచురల్‌గా యాంటీ ఏజింగ్ మంచి పద్ధతి
ఒక్కటేమిటి మనిషి అందం కోసం చాలా చేస్తున్నాడు. వయసును సహజంగా కాకుండా ట్రీట్మెంట్ రూపంలో ఆపాలనుకుంటున్నాడు. అదే సమస్యలు కొని తెస్తోంది. యాంటీ ఏజింగ్ అన్నది సహజసిద్ధంగా చేస్తేనే అందం. ఎందుకంటే అందం, ఆరోగ్యం బాగుండాలంటే.. మంచి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, వ్యాయామం, మానసిక ప్రశాంతత ఇవే సహజమైన ఔషధాలు. కానీ మనిషి మాత్రం సర్జరీలు, మెడిసిన్స్‌తో వయసును ఆపాలనుకుంటున్నాడు. రకరకాల సర్జరీలు కూడా తెరపైకి వచ్చాయి. మరి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ రిస్క్ ఫ్రీనా?
అందం కోసం అంటే లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకున్నట్లే
కానే కాదు.. లుక్స్ కెన్ కిల్. అవును మీరు విన్నది నిజమే. అందం కోసం ఏదైతే చేస్తున్నారో అదే ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ మధ్య హార్ట్ ఎటాక్స్ పెరుగుతున్నాయి కదా.. వాటిలో కొన్ని కేసుల్లో కారణంగా ఇలాంటి చికిత్సలే. అందంగా కనిపించాలనుకోవడం లైఫ్ ను రిస్క్ లో పెట్టుకున్నట్లే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా షెఫాలీ జరివాలా ఉదంతమే నిదర్శనం. ఇవాళ్టి బ్యూటిఫుల్ గా కనిపించడానికి చాలామంది ఇందులో సెలబ్రిటీలైతేనేని.. సామాన్యులైతేనేమి.. అందరూ కాస్మెటిక్ సర్జరీలు, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లు, బరువు తగ్గించే చికిత్సలు చేయించుకుంటున్నారు. కానీ ఈ ట్రీట్మెంట్లు కొన్నిసార్లు ఆరోగ్యాన్ని రిస్కులో పెట్టి ఏకంగా ప్రాణాంతకంగా కూడా మారుతాయన్నది నిజం.
అనుభవం లేని డాక్టర్లతో చాలా డేంజర్
కాస్మెటిక్ సర్జరీల విషయానికొస్తే.. చాలామంది ముఖాన్ని అందంగా మార్చడానికి బోటాక్స్, ఫిల్లర్‌లు, అలాగే ఫేస్‌లిఫ్ట్ వంటి సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇవి సాధారణంగా సేఫ్ గానే చెబుతారు. అయితే ఎక్స్ పీరియన్స్ లేని డాక్టర్లు లేదా సరైన వసతులు లేని క్లినిక్‌లలో చేయించుకుంటే సమస్యలు కచ్చితంగా వస్తాయి. చర్మంలో మార్పులు జరిగి, మచ్చలు ఏర్పడి, ముఖ వైకల్యానికి దారి తీయొచ్చు. లేదా అనస్థీషియా వల్ల సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం కావచ్చు. హైదరాబాద్ లోనే దంతాల ట్రీట్మెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తికి అనస్థీషియా ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడు. సో ఇదొక ఎగ్జాంపుల్.
చర్మం తెల్లగా అవడానికి గ్లుటథియోన్ ఇంజెక్షన్
ఇప్పుడు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ సంగతి, వాటి సైడ్ ఎఫెక్టులు ఏంటో చూద్దాం. గ్లటథియోన్ ఇంజెక్షన్లు చర్మాన్ని తెల్లగా, మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతాయి. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే కిడ్నీ, లివర్ సమస్యలు లేదా అలెర్జీ రియాక్షన్లు రావచ్చు. ఇక ముడతలను తగ్గించడానికి బోటాక్స్ ఇంజెక్షన్లు వాడతారు. కానీ ఇవి కరెక్ట్ డోస్ లో ఇవ్వకపోతే ఫేస్ లో మజిల్స్ షేప్ మారిపోతుంటాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అసలు మీ ముఖాన్ని ఎవరూ చూడని విధంగా తయారవుతుంది. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి యవ్వన రూపాన్ని కాపాడుకోవడానికి స్టెమ్ సెల్ ఇంజెక్షన్లు తీసుకుంటారు. కానీ దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పటిదాకా పెద్దగా కనుక్కున్నది లేదు. రిస్క్ తీసుకుంటే లైఫే డేంజర్ లో పడుతుంది.
అనస్థీషియా ఓవర్ డోస్‌తో ప్రాణాంతకం
అందంగా కనిపించే ట్రీట్మెంట్లు ఒకటైతే.. ఇక బరువు తగ్గించే చికిత్సలు కూడా బాగానే ప్రచారంలో ఉన్నాయి. లిపోసక్షన్ సర్జరీతో శరీరంలోని కొవ్వును తొలగిస్తారు. అయితే రక్తస్రావం అవడం, రక్తం గడ్డకట్టడం, లేదా అనస్థీషియా వంటి సమస్యలతో చనిపోయిన వారూ ఉన్నారు. ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ చనిపోయిన వారికి చేసిన పోస్ట్ మార్టం రిపోర్టులలో కీలక అంశాలు వెలుగు చూశాయి. శరీరంలో ఏమేం మార్పులు జరిగి చనిపోయారో ఎయిమ్స్ డాక్టర్లు గతంలోనే పోస్ట్ మార్టం రిపోర్టుల వివరాలు బయటపెట్టారు.
యవ్వనంగా కనిపిస్తే ఎక్కువ అవకాశాలన్న ఆలోచన
సమాజంలో సినీ సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లైనా ఒక ఒత్తిడి ఉంటుంది. స్క్రీన్ ముందు బాగా కనిపించాలి అనుకుంటారు. ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకుంటారు. అందుకే ఈ ఒత్తిడితో వారు బోటాక్స్, ఫిల్లర్‌లు, లేదా గ్లటథియోన్ ఇంజెక్షన్ల వంటి చికిత్సలవైపు వెళ్తుంటారు. సౌందర్య చికిత్సలు అనగానే కేవలం మహిళలే కాదు… పురుషులు కూడా ఈ క్యూలో ఎక్కువగా ఉంటున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లు, బోటాక్స్, లిపోసక్షన్ వంటివి మగవాళ్లు కూడా చేసుకుంటున్నారు. ఏదో చేద్దామనుకుని చాలామంది ప్రమాదకరమైన ట్రీట్మెంట్లను ఎంచుకుంటున్నారు.
Also Read: రాజస్థాన్ పురావస్తు తవ్వకాల్లో బయటపడిన చారిత్రక వస్తువులు ఇవే.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!
అనుభవజ్ఞులైన్ డాక్టర్లతోనే సేఫ్ సర్జరీలు..
ఇలాంటి సర్జరీలు, యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. కాస్మెటిక్ సర్జరీలైనా, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఎక్స్ పీరియెన్స్ డ్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించాలి. బ్లడ్ టెస్టులు, అలెర్జీ టెస్ట్‌లు ముందుగానే చేయించుకోవడం ద్వారా శరీరం ఆ ట్రీట్మెంట్లకు సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఈ యాంటీ ఏజింగ్ కాస్మొటిక్ సర్జరీలు చేసుకోవాలనుకుంటే.. ఆ చికిత్సల సైడ్ ఎఫెక్టులు, ప్రాణాంతక పరిస్థితుల గురించి పూర్తి సమాచారం ముందే తెలుసుకోవడం బెటర్. ఇవన్నీ వద్దు అనుకుంటే.. సరైన డైట్, వ్యాయామం, సన్‌స్క్రీన్ వాడకం, తగినంత నీరు తాగడం, మానసిక ప్రశాంతతం ఇలాంటివి వృద్ధాప్యాన్ని త్వరగా రానివ్వవు. వయసు పెరుగుతున్నా కొద్దీ.. లేనిపోని ఆలోచనలు మానేసి సహజ వృద్ధాప్యాన్ని స్వీకరించడం మంచి మార్గం. శేష జీవితం బాగుంటుంది. లేదంటే నాలుగు పదుల వయసులోనే నూరేళ్లు నిండిపోతాయి షెఫాలీ జరివాలా మాదిరి. సో బీ అలర్ట్. బీ సేఫ్. బీ ఎడ్యుకేట్. బీ అవేర్.