Irumudi Movie:ఇరుముడి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎప్పుడు చూడని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు రాబడుతూ థియేటర్లలో దూసుకుపోతోంది. చిన్న, పెద్ద, ముసలి అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ (Raviteja) కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచి దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లకు లాభాల పంట పండిస్తున్న సమయంలో.. సడన్గా థియేటర్ల నుంచి ఈ సినిమా తీసేయాల్సి రావడంపై ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 21న థియేటర్లలో ఇరుముడి సినిమా విడుదలయ్యింది. ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్ కి వచ్చి మరీ ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కలెక్షన్లు బాగా వస్తుండగా.. ఇప్పుడు సినిమాను థియేటర్ నుండి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం యశ్ (Yash) టాక్సిక్ (Toxic) మూవీ అని చెప్పాలి.
టాక్సిక్ మూవీ కోసం థియేటర్ల విషయంలో గతంలో ఒప్పందం చేసుకోవడం వల్లే.. ఇప్పుడు ఇరుముడి సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నప్పటికీ తీసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఒప్పందం కారణంగా తెలంగాణలో సుమారుగా 120 థియేటర్ల నుంచి ఇరుముడి సినిమాను తొలగించే పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ..” మా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు ” అంటూ కొందరు ఎగ్జిబిటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ” గత ఆరేళ్లలో ఎప్పుడూ చూడని స్థాయిలో ఇరుముడి కలెక్షన్లు వస్తున్న సమయంలో థియేటర్లు ఖాళీ చేయాల్సి రావడం చాలా బాధాకరం.. సినిమా బాగున్నా.. థియేటర్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు? ” అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి.
అంటే ఎగ్జిబిటర్ల అభిప్రాయం ప్రకారం.. థియేటర్ల నుండి సినిమాను తీసేయడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా తీసేస్తున్నాం అన్న పరిస్థితి నెలకొనింది.అంతేకాదు ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమాను థియేటర్ల నుండి తొలగించడం న్యాయమేనా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. నిజానికి ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకే థియేటర్ల నుంచి సినిమాను తొలగించాలా? లేక ప్రేక్షకుడి డిమాండ్ ను బట్టి థియేటర్లలో సినిమాకొనసాగించాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
టాక్సిక్ విషయానికి వస్తే.. ప్రముఖ మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో.. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. కియారా అద్వానీ హీరోయిన్గా, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఏకకాలంలో విడుదలవుతూ.. తెలుగు, తమిళ్, హిందీ , మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలో ఆగస్టు 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆగస్టు 25 రాత్రికి పెయిడ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.
also read:చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!
ఇక ఈ సినిమా కోసమే కలెక్షన్లు రాబడుతున్న ఇరుముడి సినిమాను థియేటర్ల నుండి తొలగించే పరిస్థితి రావడంతో ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టాక్సిక్ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతే ఎగ్జిబిటర్ సేవ్ జోన్ లో పడతారు.. అలా కాదని టాక్సిక్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం థియేటర్ల నుండి టాక్సిక్ తొలగించి మళ్లీ ఇరుముడి ప్రదర్శిస్తారా? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.