Harihara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగేళ్లు కష్టపడి విడుదలకు సిద్ధం చేసిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ నుండి పలు కారణాల వల్ల క్రిష్ తప్పుకోవడంతో రంగంలోకి జ్యోతి కృష్ణ (Jyoti Krishna)ఎంటర్ అయ్యారు. ఈ సినిమా నిర్మాత ఏ.యం.రత్నం (AM Ratnam) కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి కథను జూలై 24వ తేదీన ఎట్టకేలకు విడుదల చేయబోతున్నారు.
హరిహర వీరమల్లు విడుదల అడ్డుకుంటాము – బీసీ సంఘాలు
ఇప్పటికే దాదాపు 14 సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నిన్న హరిహర వీరమల్లు నుండి ట్రైలర్ రిలీజ్ చేయగా ఒక వర్గం అభిమానులను భారీగా ఆకట్టుకున్నా.. కాపీ ఆరోపణలు కూడా ట్రైలర్ పై వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మాత్రమే కవర్ చేశారని, మిగతా ఆర్టిస్టులను తక్కువగా చూపించారని కూడా కామెంట్లు చేశారు. అలా మొత్తానికైతే ఈ ట్రైలర్ కి మిక్స్డ్ టాక్ లభించింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కల్పిత కథతో బీసీల ఆత్మగౌరవానికి అవమానం కలిగించారు – బీసీ సంఘాలు
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న ట్రైలర్ విడుదల చేసిన తర్వాత బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందించారు. అయితే ఇక్కడ సాయన్న జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చేసి ఇష్టం వచ్చినట్లు తీశారు అని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ బందూక్, ప్రజా వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరిస్తూ.. చరిత్రలోనే లేని ఒక కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు అనే పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇది యావత్ బహుజనుల, బీసీల ఆత్మగౌరవానికి అవమానం. మా బహుజన నాయకుడు, ప్రజా వీరుడు పండుగ సాయన్న జీవిత కథను వినోదం, డబ్బుల కోసం చరిత్రను తప్పుదోవ పట్టించేలా తీసిన ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకుంటాము అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
విడుదల వేళ మళ్లీ ఈ కొత్త కష్టాలేంటి..
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిత్ర బృందానికి ఈ కొత్త కష్టాలు ఏంటి అంటే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా వివరణ ఇస్తుందేమో చూడాలి.