Theater Releases: ఎప్పటిలాగే ఈవారం కూడా ఎన్నో చిత్రాలు అటు ఓటీటీలలో ఇటు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఓటీటీలలో అలరించే చిత్రాలను కాస్త పక్కన పెడితే.. ఈ వారం కొత్తగా థియేటర్లలో సందడి చేయబోతున్న ఏడు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఆయా చిత్రాల ప్రమోషన్స్ హడావిడి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వారాంతం ఆగస్టు 15.. పైగా శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఆయా చిత్రాలు విడుదల తేదీలను లాక్ చేసుకున్నాయి. యాక్షన్, లవ్ , విలేజ్ కామెడీ , ఎమోషన్, థ్రిల్లర్ ఇలా ఒక్కో సినిమా ఒక్కో ప్రత్యేకతతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతోంది. మరి ఈ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ఆ ఏడు చిత్రాలు ఏంటి? ప్రత్యేకించి రెండు చిత్రాలు మరింత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న తెలంగాణ గ్రామీణ నేపథ్య ఎంటర్టైనర్ చిత్రం పళ్ల బురుసు. వేప పుల్లతో పళ్ళు తోముకోలేక పంటి నొప్పితో బాధపడుతున్న ఒక వృద్ధ తండ్రి.. తన కొడుకును ఒక టూత్ ఫ్రెష్ కొనివ్వమని అడగడంతో మొదలైన చిన్న కోరిక.. చివరికి జిల్లా కోర్టు మెట్లు ఎక్కేంత పెద్ద గందరగోళానికి ఎలా దారితీసింది? అనే ఒక వినూత్న పాయింట్ తో ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యం, తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయ్ చౌహాన్ దర్శకుడిగా పరిచయమవుతూ.. రాబోతున్న ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి , డీ జే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలతో కట్టిపడేసే ఈ సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ప్రయోగాత్మక చిత్రం ఇది. సూర్య(Suriya ) అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించదగ్గ షార్ప్ షూటర్ ‘సంజయ్ విశ్వనాథ్’ పాత్రలో నటించనున్నారు. మమిత బైజు(Mamitha baiju) హీరోయిన్ గా నటిస్తోంది. అసాధారణమైన ప్రేమ కథ, నువ్వులు పూయించే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలం. రొమాన్స్ ,హ్యూమర్, స్పోర్ట్స్ డ్రామా మేలవింపుగా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇవ్వనుంది.
స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు(MS Raju) దర్శకత్వంలో.. ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) లీడ్ రోల్ పోషిస్తూ రాబోతున్న మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ చిత్రం అగధ.. వరుస విషాదకర మరణాలు, కజిన్ రహస్య ఆత్మహత్య నేపథ్యంలో సాగే ఈ కథ ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. రహస్యాలతో కూడిన ఒక అడవి గుహ నేపథ్యంలో ఊహకందని అతీంద్రియ శక్తుల అన్వేషణ చుట్టూ తిరిగే ఈ కథ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా మస్ట్ వాచ్ లిస్టులో చేరడం గమనార్హం. ఈ సినిమా కూడా ఆగస్టు 14న అనగా ఇండిపెండెన్స్ డేకి ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పూర్తిస్థాయిలో మెగా ఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మకుటం. ప్రశాంతంగా బతకాలనుకున్న ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని నమ్మకద్రోహం ఎలా మార్చింది? హింసాత్మక వారసత్వాన్ని మోస్తూ తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే డ్రామాతో ఈ సినిమా రాబోతోంది.
ఈ చిత్రాలతో పాటు ప్రీతిజింటా, సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించిన బట్వారా 1947, 2007లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఆవారాపన్ కు సీక్వెల్ యాక్షన్ గా వస్తున్న ఆవారాపన్ 2, కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇక మరొకవైపు ఆగస్టు 15న పబ్లిక్ హాలిడే కావడంతో యువతను టార్గెట్ చేస్తూ వస్తున్న ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ ‘హుషారు పిట్టలు’. ఇలా స్టార్ హీరోల భారీ చిత్రాల నుంచి విభిన్నమైన కాన్సెప్ట్ ఉన్న రూరల్ డ్రామాలు, థ్రిల్లర్, యూత్ ఫుల్ మూవీస్ వరకు అన్ని ఒకేసారి ఒకే వారాంతంలో రాబోతుండడంతో ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని పంచుతూ బాక్సాఫీస్ కి ఈ చిత్రాలు మంచి బూస్ట్ ఇవ్వడం ఖాయమని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.
also read: నా ఓటు గల్లంతయ్యింది -ప్రకాష్ రాజ్