Boy Lives in Pond: పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్‌దంగా గ్రామానికి చెందిన ఇక్బాల్ షేక్ (Iqbal Sheikh) అనే 16 ఏళ్ల బాలుడి కథ ప్రస్తుతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత ఐదేళ్లుగా ఈ బాలుడు గ్రామంలోని చెరువులోనే జీవిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కోసారి చెరువు నుంచి అడుగు పెట్టకుండా నీటిలోనే 4 నుంచి 7 రోజుల పాటు ఉండిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ బాలుడ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చెరువు వద్దకు క్యూ కడుతున్నారు.
అయితే నీటిలో ఇలా రోజులు, వారాలు, నెలలు తరబడి ఉండటానికి గల కారణాన్ని ఇక్బాల్ షేక్ పంచుకున్నాడు. నీటి నుంచి బయటకు రాగానే శరీరమంతా తీవ్రమైన మంట వస్తోందని వాపోతున్నాడు. గాలి తగలగానే ఈ మంట మొదలవుతుందని.. తిరిగి నీటిలోకి వెళ్తేనే ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నాడు. ఈ పరిస్థితికి ఏదో దెయ్యం లేదా జిన్ ఆవహించడమే కారణమని బాలుడు నమ్ముతున్నాడు. అయితే వైద్య నిపుణులు మాత్రం దీని వెనుక ఏదైనా శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్య ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
🇮🇳 A 16-year-old boy in West Bengal has spent nearly five years living in ponds, saying his body burns the moment he leaves the water. pic.twitter.com/pPzLWyi65x
— Planet Report HQ (@PlanetReportHQ) August 10, 2026
అయితే రాత్రింబవళ్లు నీటిలోనే గడపడం వల్ల బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోంది. శరీరం నిరంతరం నీటిలోనే ఉండటంతో చర్మం రంగు మారిపోవడమే కాకుండా విపరీతంగా ఉబ్బిపోయింది. దీనికి తోడు అతడు నిరంతరం తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడని స్థానికులు తెలిపారు. చెరువు వద్దకు వచ్చే గ్రామస్థులు ఇచ్చే అటుకులు, బిస్కట్లు, ఇతర అల్పాహార తినుబండారాలు తింటూ అతడు కాలం వెళ్లదీస్తున్నాడు.
బాలుడు రోజుల తరబడి నీటిలోనే ఉంటున్నట్లు తెలిసి.. సమీప గ్రామాల ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. దీంతో బాలుడి వేదన కాస్త స్థానికంగా ఓ వింతగా మారిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు, అధికారులు బాలుడ్ని నీటి నుంచి బయటకు తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Airtel బంపరాఫర్.. రోజుకు రూ.12 కే 5G డేటా, రూ.4,000 విలువైన బెనిఫిట్స్.. ప్లాన్ వివరాలు ఇవే!
అయితే బాలుడికి ఉన్న సమస్య ఏంటో స్థానిక వైద్యులకు సైతం అంటుబట్టడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. నగరాలకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించే ఆర్థిక స్థోమత తమ వద్ద లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని నివేదికల ప్రకారం.. బాలుడి లక్షణాలు ‘ఆక్వాజెనిక్ ప్రురిటస్’ (Aquagenic Pruritus) అనే అరుదైన చర్మ సమస్యను పోలి ఉన్నాయి. ఈ వ్యాధి ఉన్నవారికి గాలి లేదా నీరు శరీరాన్ని తాకినప్పుడు చర్మంపై తీవ్రమైన దురద, మంట వస్తాయి. అయితే సరైన వైద్య పరీక్షలు నిర్వహిస్తే తప్ప బాలుడి అసలు సమస్య ఏంటో స్పష్టంగా తెలిసే అవకాశం లేదు.
Also Read: సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!