Rukmini Vasanth: ఎంత దాచాలనుకున్నా కొన్ని కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాల్లో నటించే హీరోయిన్ల విషయంలో అయితే అవి ఇంకా ఎక్కువ బయటపడిపోతూ ఉంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా.. గాసిప్స్ వచ్చినా హీరోయిన్లు మాత్రం తాము ఇంకా ఆ సినిమాలో చేయడం లేదనే చెప్పుకొస్తారు. మొన్నటివరకు కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా అదే పని చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డ్రాగన్. దేవర తరువాత ఈ సినిమా పట్టాలెక్కింది.
ఇక డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తుందని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ విషయమై చిత్రబృందం స్పందించలేదు. రుక్మిణి అయితే.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్సా.. వస్తే బావుండు అంటూ చెప్పడంతో కొన్నిరోజులు అందరూ ఈమె హీరోయిన్ కాదేమో అనుకున్నారు. ఆ తరువాత చాలామంది సెలబ్రిటీలు కొద్దికొద్దిగా హింట్స్ ఇస్తూ వచ్చారు.తాజాగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్టేజిపైనే డ్రాగన్ హీరోయిన్ రుక్మిణి అని అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మదరాశి. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. గతరాత్రి మదరాశి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో సినిమా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ” మదరాశి సినిమాలో రుక్మిణిని ఎంపిక చేసినప్పుడు ఆమె ఒక అప్ కమింగ్ హీరోయిన్. కానీ, ఇప్పుడు కాంతారా 2 లో ఆమె హీరోయిన్, ఎన్టీఆర్ డ్రాగన్ లో ఆమె హీరోయిన్.. యష్ టాక్సిక్ లో కూడా ఆమె హీరోయిన్. ఇప్పటివరకు మదరాశి కోసం ఆమె కష్టపడింది. ఈ సినిమా తరువాత కాంతారా 2 ప్రమోషన్స్ లో భాగం కానుంది” అని చెప్పుకొచ్చాడు.
ఇక నిర్మాత అధికారికంగా చెప్పడంతో డ్రాగన్ లో రుక్మిణినే హీరోయిన్ అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. కేవలం నిర్మాత మాత్రమే కాకుండా సుమ కూడా రుక్మిణిని ఎన్టీఆర్ గురించి అడిగి మరింత కూపీ లాగడానికి ప్రయత్నించింది. ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పు అని సుమ అడగగా.. రుక్మిణి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పలేము.. ఆయన ఒక డిక్షనరీ అంటూ చెప్పడంతో.. ఆమె కూడా డ్రాగన్ లో నటిస్తున్నట్లు అధికారికంగా చెప్పిన్నట్లు అయ్యింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో రుక్మిణి, ఎన్టీఆర్ ఫోటోలను ఎడిట్ చేసి పండగ చేసుకుంటున్నారు. వార్ 2 తో భారీ పరాజయాన్ని అందుకున్న ఎన్టీఆర్.. డ్రాగన్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.