Jyothi Lakshmi :
ఇప్పుడంటే ఐటం సాంగ్స్ కాస్తా స్పెషల్ సాంగ్స్‌గా మారిపోయాయ్. ఇక హీరోయిన్లే ఐటం భామలుగా అదరగొట్టేస్తున్నారు. కాని ఒకప్పుడు ఈ ఐటం సాంగ్స్‌కు, అందులో స్టెప్పులేసే అందాల భామలకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక మాస్ ఆడియన్స్‌ని సినిమా హాళ్లకి పరుగులు పెట్టించే ఈ నంబర్స్ కోసమే మేకర్స్ స్పెషల్‌గా కేర్ తీసుకునేవారు కూడా.అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ ఐటం సాంగ్స్ ట్రెండ్‌కు ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎవరో తెలుసా… ఏంటి సిల్క్ స్మితనో, జయమాలినో అనుకుంటున్నారా… అయితే మీరు కూడా సాంగ్‌లో స్టెప్పేసినట్టే. అవును… వాళ్లకన్నా ముందే ఐటం సాంగ్స్‌కు ఓ రేంజ్ బ్రాండ్ క్రియేట్ చేసింది జ్యోతిలక్ష్మి. మరి కరాటే క్వీన్‌గా జర్నీ మొదలెట్టి ఐటం బాంబ్‌గా అదరగొట్టిన జ్యోతిలక్ష్మి జీవితాన్ని ఎలా మొదలెట్టి, ఎలా ముగించిందో క్విక్‌గా చూసేద్దాం.
బాల్యం మరియు నేపథ్యం
1948 నవంబర్ 2న తమిళ అయ్యంగార్ల కుటుంబంలో టి.కె. రాజరామన్, శాంతవి దంపతులకి జన్మించింది జ్యోతిలక్ష్మీ. వీరికి ఎనిమిది మంది సంతానం కాగా అందులో ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వారిలో జ్యోతిలక్ష్మీ అందరికంటే పెద్దది కాగా, అందరికంటే చిన్నది జయమాలిని. ఇక అప్పటికే తమిళ నాట ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది రాజరామన్ సోదరి ఎస్.పి.ఎల్. ధనలక్ష్మీ. కానీ ఆమెకు పిల్లలే లేరు. ఈ కారణంగా జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకోవడంతో జ్యోతిలక్ష్మీ చిన్నతనం అంతా ఆమె దగ్గరే గడిచిపోయింది. అలా చిన్నతనంలోనే జ్యోతిలక్ష్మీ రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకోవడం విశేషం.
సినీరంగ ప్రవేశం
ఎస్.పి.ఎల్. ధనలక్ష్మీ నటి కావడంతో కేవలం ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడే సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చింది. అలా మొదటిసారిగా దర్శక నిర్మాత టి.ఆర్. రామన్ ఎం.జీ.ఆర్ తో చేసిన ఓ సినిమాలో డాన్స్ వేస్తూ కనిపించింది. ఇక ఆ తర్వాత మరో మూడేళ్లకి అంటే ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం ‘కార్తవరాయన్ కథ’లో డ్యాన్స్ చేసి అందర్ని మెప్పించింది. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం ‘పెరియ ఇడత్తు పెణ్’తో పూర్తి స్థాయి నటిగా సినీ రంగంలోకి ప్రవేశించిన జ్యోతిలక్ష్మీ, ఆ సినిమాలో నగేష్ జోడీగా వల్లి అనే కామెడీ పాత్రలో నటించి మెప్పించింది.
తెలుగులో తిరుగులేని క్రేజ్
తెలుగులో జ్యోతిలక్ష్మీ కనిపించిన మొదటి సినిమా 1967లో విడుదలైన ‘పెద్దక్కయ్య’. అయితే ‘ఇదా లోకం’ అంటూ శోభన్ బాబు హీరోగా 1973లో వచ్చిన సినిమానే జ్యోతిలక్ష్మీ కెరీర్ ని మలుపు తిప్పింది అని చెప్పాలి. ఈ సినిమాలో ‘గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు’ అన్న పాటకి జ్యోతిలక్ష్మీ వేసిన స్టెప్పులు అప్పట్లో ఒక ఊపు ఊపాయ్. ఈ పాట వల్లే సినిమా ఇప్పటికీ గుర్తుంటుంది అంటే ఆశ్చర్యం లేదు. ఇక ఆ మధ్య వచ్చిన ‘కుబేరులు’ అనే సినిమాలో ఇదే పాటకి జ్యోతిలక్ష్మీ స్టెప్పులేయడం విశేషం. ఇక ఏఎన్ఆర్ ‘ప్రేమనగర్’లో “లే లే నా రాజా”పాటకి అయితే ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది.
ALSO READ:అక్కినేని కంటే క్రేజ్.. విదేశీ కార్లలో షికార్లు.. కట్ చేస్తే చివరకు కారు డిక్కీలో అనాథ శవంలా!
గోల్డెన్ పీరియడ్
70లలో స్పీడ్ అందుకున్న జ్యోతిలక్ష్మీ కెరీర్ కి 80, 90ల కాలం గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. హీరో ఎవరైనా సరే సినిమా ఏదైనా సరే జ్యోతిలక్ష్మీ పాట ఉండాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఒకానొక దశలో హీరోల కోసం కాకుండా జ్యోతిలక్ష్మీ పాటల్ని చూడ్డానికే ఆడియన్స్ సినిమా హళ్ళకి క్యూ కట్టేవారు. ఆ పాట అయిపోగానే సినిమా చూడకుండా మధ్యలోనే వెళ్ళిపోయేవారు. అంటే సినిమాకి టికెట్లు తెంచేది జ్యోతిలక్ష్మీ పాటలేనన్న మాట. అందుకే మేకర్స్ ఏరికోరి జ్యోతిలక్ష్మీని తమ సినిమాల్లోకి బుక్ చేసుకునేవారు. తన డేట్స్ దొరికితే గనుక సినిమా సగం హిట్టయినట్లే అని అనుకునే వారు. అందుకే అప్పట్లో హీరోయిన్ల కంటే ఈమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
యాక్షన్ క్వీన్ గా గుర్తింపు
అలా ఐటమ్ సాంగ్స్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన జ్యోతిలక్ష్మీ సినిమాల్లో కనిపించే క్లబ్ డ్యాన్స్‌లకు కేరాఫ్ గా నిలిచింది. ఆమె డాన్స్ లోని స్పీడ్, గ్రేస్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మిగతావారికన్నా భిన్నంగా కనిపించేది. పైగా ఆమె చేసిన చాలా పాటలకి తనే డాన్స్ మూమెంట్స్ డిజైన్ చేసుకోవడం విశేషం. అలా అని జ్యోతిలక్ష్మి కేవలం పాటలకే పరిమితం అయిపోలేదు. స్వయంగా మార్షల్ ఆర్ట్స్ (కరాటే వంటివి) నేర్చుకుంది. దీని వల్ల ఆ రోజుల్లోనే సినిమాల్లో డూప్ లేకుండా ఫైట్స్ చేసేది. అందుకే ఆమెను అప్పట్లో ‘యాక్షన్ క్వీన్’, ‘మిస్ రౌడీ’అని పిలిచేవారంతా.శోభన్ బాబు, కృష్ణ వంటి హీరోల సినిమాల్లో ఆమెకు ప్రత్యేకమైన యాక్షన్ రోల్స్ ఉండేవి.ఇక ‘స్టేట్ రౌడీ’, ‘మొనగాడు’ వంటి సినిమాల్లో చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్.
ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘ఊరికి మొనగాడు’ వంటి చిత్రాల్లో ఆమె చేసిన యాక్షన్ మరియు డ్యాన్స్ ప్రేక్షకులను పిచ్చెక్కించేశాయ్. ఆమె కోసమే స్పెషల్ గా ఫైట్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్ సీన్లు సినిమాలో పెట్టేవారంటే ఆమెకున్న డిమాండ్ ఏంటో ఊహించుకోవచ్చు.
బాలీవుడ్ ఎంట్రీ
సౌత్ సినిమాల్లో వ్యాంప్ లేదా డ్యాన్సర్ పాత్రలు చేసిన జ్యోతిలక్ష్మి, హిందీలో మాత్రం హీరోయిన్‌గా తళుక్కుమంది. కిషోర్ కుమార్ సరసన ‘పాయల్ కీ ఝంకర్’ (1968)అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక హిందీలో కిషోర్ కుమార్ సరసన హీరోయిన్‌గా నటించిన ఏకైక ఐటమ్ గర్ల్ జ్యోతిలక్ష్మినే కావడం గమనార్హం. ముఖ్యంగా ‘పిస్తోల్ వాలి’ వంటి సినిమాల్లో ఆమె చేసిన స్టంట్స్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయ్.
ALSO READ: పుష్ప 2 రేంజ్ హైప్.. కానీ ప్రమోషన్లు సున్నా! పెద్ది టీమ్ ప్లానింగ్ ఇంతేనా?
వ్యక్తిగత జీవితంలో కష్టాలు
హీరోలతో సరిసమానంగా టైటిల్ కార్డ్స్ పడేలా క్రేజ్ తెచ్చుకొని ఓ వెలుగు వెలిగిన జ్యోతిలక్ష్మీ.. రియల్ లైఫ్ లో మాత్రం అష్ట కష్టాలు పడింది. ముఖ్యంగా వాసుదేవన్‌ని పెళ్లి చేసుకున్న జ్యోతిలక్ష్మీ దాదాపు ఎనిమిదేళ్ళ పాటు నరకం చూసింది. కారణం ఆయనకి అప్పటికే పెళ్ళయి ఉండటమే. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకపోవడం వల్ల వీరి వివాహ బంధం గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా సహజీవనంలా సాగించాల్సిన పరిస్థితి. వీరికి మీనాక్షి అనే పాప కూడా ఉంది. వాసుదేవన్ నిర్మాతలతో రూడ్ గా ప్రవర్తించడం వల్ల జ్యోతిలక్ష్మీకి ఒక్కసారిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయ్.
జ్యోతిలక్ష్మీ సినీ జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ సినిమా నుండి మాయమైపోవడం గురించి. 1980లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘సరదారాముడు’ షూటింగ్‌లో జ్యోతిలక్ష్మీ పాల్గొనాల్సి ఉంది. కానీ ఎవరికీ చెప్పాపెట్టకుండా మాయం అవడంతో నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. చేసేది లేక తన స్థానంలో విజయలలితను తీసుకోవాల్సి వచ్చింది. వాసుదేవన్ భార్య నుంచి తప్పించుకునేందుకే జ్యోతిలక్ష్మీ బొంబాయి వెళ్లిపోయి కొన్ని రోజుల తర్వాత తిరిగొచ్చారని తర్వాత తెలిసింది. ఇక వాసుదేవన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన జ్యోతిలక్ష్మీ సినిమాటోగ్రాఫర్ సాయిప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. తన కూతురు మీనాక్షి పేరును జ్యోతిమీనా గా మార్చగా, ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ తల్లికి వచ్చినంత పేరును మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి చెన్నైలో స్థిరపడిపోయింది జ్యోతిమీనా.
చివరి దశ
ఆ కాలంలో ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ డ్యాన్సర్లు (అక్కాచెల్లెళ్లు) కలిసి నటించడం అరుదు. కానీ జ్యోతిలక్ష్మి, చెల్లి జయమాలిని కలిసి పలు చిత్రాల్లో పోటీ పడి మరి డ్యాన్స్ చేసేవారు. అయితే, జయమాలిని ఎంటర్ అయ్యాక జ్యోతిలక్ష్మి నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ వైపు మొగ్గు చూపారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆమె స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారంటే ఆమె డెడికేషన్ ని అర్థం చేసుకోవచ్చు.
ఆమె చివరిగా విశాల్ హీరోగా నటించిన ‘మగ మహారాజు’ (తమిళంలో ‘ఆంబాల’) చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సినిమా పట్ల ఉన్న ఇష్టంతో ఆ పాత్రను చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అన్న తేడా లేకుండా సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి, కెరీర్ చివర్లో టెలివిజన్ సీరియల్స్‌లోనూ కనిపించడం గమనార్హం.
ఒకప్పుడు కోట్లు సంపాదించిన జ్యోతిలక్ష్మి డబ్బుని జాగ్రత్త చేసుకోకపోవడంతో చివరి రోజుల్లో చాలా కష్టాలనే అనుభవించింది. తనకి బ్లడ్ క్యాన్సర్ ఎటాక్ చేయడం ఆమెని బాగా కుంగ దీసింది. అయినప్పటికీ, సినిమాపై ఉన్న ఇష్టంతో చివరి వరకు నటించడం మెచ్చుకో తగ్గ విషయం.ఏది ఏమైనా 2016 ఆగస్టు 9న ఆమె చనిపోయినప్పటికీ తెలుగు సినిమా హిస్టరీలో ‘జ్యోతిలక్ష్మి’ కి ఒక స్పెషల్ చాప్టర్ ఉంటుంది అన్నది నిజం.
ALSO READ :దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. రవితేజ బలి? ఆ టైటిల్ వెనుక అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు!