Kriti Sanon:కూతుర్లు ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు తిరిగి ఎప్పుడువస్తుందా అని తల్లి దండ్రులు ఎదురుచూడటం చాలా కామన్. ముఖ్యంగా రాత్రిపూట అమ్మాయిలు ఒంటరిగా బయటికి వెళ్లినప్పుడు ఏమవుతుందా అని హార్ట్ ని అరచేతుల్లో పెట్టుకుని మళ్ళీ వచ్చేవరకు కళ్ళలో వత్తులు వెసుకుని ఎదురు చూస్తుంటారు.ఇదిగో ఇదే విషయాన్ని డాటర్స్ డే సందర్భంగా గుర్తుచేస్తుంది బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.
నన్ను ఫాలో అవుతున్నట్టుగా ఉంది
‘కొంతమంది మగవాళ్ళు నన్ను ఫాలో అవుతున్నట్టుగా ఉంది’ అంటూ ఒక కూతురు ఇంటికి ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఊహించుకోవాలని ఆమె అన్నారు. అలాగే రాత్రి ఒంటరిగా ఇంటికి నడిచి వెళ్లేటప్పుడు అమ్మాయిలు పదేపదే వెనక్కి తిరిగి చూసుకోవడం, ఇంటికి చేరుకునేలోపే ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏం జరుగుతుందోనని భయపడటం వంటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసింది.
లేడీస్ కి చాలా కామన్
అయితే ఇవన్నీఎదో ఒక సందర్భంలో ఎదురయ్యే సమస్యలు మాత్రమే కాదని.. చాలామంది మహిళల రోజువారీ జీవితంలో భాగమైపోయాయని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం, నడిచి వెళ్లే బదులు క్యాబ్ బుక్ చేసుకోవడం, జర్నీ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉండటం, అవసరమైతే పెప్పర్ స్ప్రే వెంట పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు లేడీస్ కి చాలా కామన్ అయిపోయాయని కృతి సనన్ తన పోస్ట్ లో తెలిపారు.
ఉండగలిగే రోజే నిజమైన డాటర్స్ డే
ఎప్పటికైనా కూతుళ్ళు ఇంటి నుండి అర్థరాత్రి బయటికి ఎలాంటి భయం లేకుండా వెళ్ళగలగాలి. పార్కులో చీకటి పడినతర్వాత కూడా స్వేచ్ఛగా కూర్చోగలగాలి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం అలర్ట్ గా లేకుండా ఉండాల్సిన అవసరం లేకుండా ఉండాలి.. తనకు నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు భయపడాల్సిన పరిస్థితి ఉండకూడదు.. ఇలా మహిళలు తమ డైలీ లైఫ్ లో స్వేచ్ఛగా ఉండగలిగే రోజే నిజమైన డాటర్స్ డే అని కృతి తన పోస్ట్ లో రాసుకొచ్చింది.
కెరీర్ విషయానికి వస్తే
కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ కేవలం కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలతో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.ముఖ్యంగా సరోగసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘మిమి’ సినిమాలో కృతి సనన్ ఫెర్ఫామెన్స్ టాప్ నాచ్ అనే చెప్పాలి . ఇక ఈ సినిమాకే కృతి సనన్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది కూడా. ఇక ‘క్రూ’ సినిమాలో టబు, కరీనా కపూర్‌లతో కలిసి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.
‘ఆదిపురుష్’ సినిమాలో జానకి పాత్రలో
అలాగే ‘లుకా చుప్పి’లో లవ్, రిలేషన్‌షిప్ నేపథ్యంలో కనిపించిన కృతి.. ‘రాబ్తా’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘హౌస్‌ఫుల్ 4’, ‘పానిపట్’ వంటి సినిమాల్లోనూ సరికొత్త పాత్రలు వేసి మెప్పించింది.ఇక మన డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో జానకి పాత్రలో కనిపించి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది.అలాగే ‘భేడియా’ సినిమాలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన కృతి.. ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా’ వంటి సినిమాలతోనూ సత్తా చాటింది.
మరోసారి గుర్తుచేసిన బాలీవుడ్ బ్యూటీ
మొత్తంగా ఒక అమ్మాయి బయటికి వెళ్లిన తర్వాత ‘నేను ఇంటికి వచ్చేశాను’ అని తల్లిదండ్రులకు మెసేజ్ చేయడం చాలా కామన్ అనిపించవచ్చు. కానీ ఆ ఒక్క మెసేజ్ వెనుక కుటుంబం ఎంత టెన్షన్ పడుతుందో, ఆ అమ్మాయి ప్రయాణం ఎంత భయంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని తన పోస్ట్ ద్వారా మరోసారి గుర్తుచేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.