MAA Manchu Vishnu: టాలీవుడ్‌లో ఇప్పుడు టెక్నాలజీ ఒక పెద్ద శాపంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తప్పుదారి పట్టిస్తూ, ప్రముఖ నటీమణులను టార్గెట్ చేసి చేస్తున్న సైబర్ నేరాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నటి జాన్వీ కపూర్ పేరుతో సర్క్యులేట్ అయిన డీప్‌ఫేక్ వీడియో ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించింది. ఇలాంటి నీచమైన పనులపై ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్‌గా స్పందించారు. ఇదొక వ్యక్తిగత సమస్య కాదని, యావత్ సినీ పరిశ్రమపై జరుగుతున్న ఒక పెద్ద కుట్ర అని హెచ్చరించారు.
సినిమాలు విడుదల కాకముందే కోట్లాది రూపాయల శ్రమను నీళ్లపాలు చేసేలా ముందస్తు పెయిడ్ నెగెటివిటీని ప్రచారం చేయడంపై విష్ణు తీవ్రంగా మండిపడ్డారు. నెట్టింట అసభ్యకర పోస్టులు, ఫేక్ కంటెంట్‌తో ఆర్టిస్టుల పరువు తీస్తున్న వారి ఆట కట్టించేందుకు ‘మా’ సంస్థ రంగంలోకి దిగింది. తప్పుదారి పడుతున్న సోషల్ మీడియా అకౌంట్లు, హ్యాండిల్స్‌కు సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఏమైనా రాసేయవచ్చు అనే భావన పెరిగిపోయిందని విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడేవారికి ఎలాంటి భయం లేకుండా పోయిందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే, సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల తప్పు చేసేవారికి బాధ్యత, జవాబుదారీతనం వస్తాయని, ఇలాంటి అంశాలపై సమాజంలో లోతైన చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
డీప్‌ఫేక్ బెడదను, ఆన్‌లైన్ వేధింపులను అడ్డుకునేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి కలిసి రావాలని విష్ణు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఇలాంటి సైబర్ క్రిమినల్స్‌కు అడ్డుకట్ట వేయగలమని చెప్పారు. ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
also read: ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!
టెక్నాలజీ మంచిదే అయినప్పటికీ, దాన్ని కొందరు ఆసరాగా చేసుకుని నటీనటుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అత్యంత హేయం. ఈ సంక్షోభ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకే తాటిపై నిలబడి మద్దతు తెలపడం ఊరటనిచ్చే అంశం. ఇక ‘మా’ తీసుకుంటున్న కఠిన చర్యలతోనైనా ఆన్‌లైన్ వేధింపులకు, డీప్‌ఫేక్ భూతానికి తెరపడుతుందో లేదో చూడాలి..