Manchu Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న మంచు కుటుంబానికి (Manchu Family) తాజాగా సుప్రీంకోర్టులో భారీ ఊరట కలిగింది. 2019లో నమోదైన ఒక కేసులో వీరికి భారీ ఊరట కలిగిస్తూ.. ఎఫ్ఐఆర్ ను గురువారం (July 31) రోజు రద్దు చేయడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, నిరసన ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై అటు మంచు మోహన్ బాబు ఇటు ఆయన వారసుడు మంచు విష్ణు లపై కేసు నమోదయింది. ఈ కేసు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద దుమారమే రేపింది. ఇక గత ఆరు సంవత్సరాలుగా ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉండగా.. ఎట్టకేలకు ఈ కేసును ఇప్పుడు ధర్మాసనం కొట్టివేసింది.
మంచు కుటుంబానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
గురువారం రోజు.. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలో సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును చాలా లోతుగా పరిశీలించింది. అయితే ఇక మునుముందు కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి మోహన్ బాబు (Mohan babu), మంచు విష్ణు(Manchu Vishnu) పై ఉన్న ఆరోపణలు సరైనవి కావని పేర్కొంటూ వారిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దీంతో గత ఆరు సంవత్సరాలగా చేస్తున్న న్యాయపోరాటానికి నిన్నటితో తెరపడింది అని చెప్పవచ్చు.
కేసు నమోదు అవ్వడానికి అసలు కారణం ఇదే..
అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ మోహన్ బాబు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో మోహన్ బాబు తన విద్యానికేతన్ లోని సిబ్బంది, విద్యార్థులతో పాటు కుమారులు విష్ణు, మనోజ్ (Manchu Manoj)తో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా తిరుపతి – మదనపల్లి రోడ్డుపై బైఠాయించారు. దీంతో 4:00 గంటల పాటు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ రోడ్డుపై ట్రాఫిక్ కి ఆటంకం కలిగించి, ప్రజలకు అసౌకర్యం కలిగించారని, ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించేలా ఈ ర్యాలీ నిర్వహించారు అని ప్రాసిక్యూషన్ వాదన వినిపించారు
అందుకే ర్యాలీ నిర్వహించాం..
అయితే విష్ణు, మోహన్ బాబు తరఫు న్యాయవాదులు మాత్రం అసలు విషయంపై తమ వాదనలు వినిపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి అని, అప్పటి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వేడుకున్నా.. సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే తాము శాంతియుతంగా నిరసన చేశామని.. తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని.. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదని.. కాబట్టి తమకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదు అని కూడా స్పష్టం చేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు పూర్తి విచారణ జరిపి కేసును కొట్టివేసింది.
ALSO READ:White Gold: పాత బంగారం అమ్మాలనుకుంటున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో డబ్బు మీ చేతికి!