Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇటీవల నాని(Nani) నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమాలో శికంజా మాలిక్ అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఈయన విలన్ పాత్రలో నటించారు. ఇలా మోహన్ బాబు పాత్రకు కూడా చాలా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన 50 సంవత్సరాల సినీ కెరియర్ లో ఇంత భయంకరమైనటువంటి పాత్రలో తాను ఎప్పుడూ నటించలేదని తెలిపారు.
శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి కథ నేరేట్ చేసేటప్పుడు అరటిపండు వలిచి పెట్టినట్టు అంత చక్కగా చెప్పారు కాని సెట్ లోకి వచ్చిన తర్వాత నన్ను చాలా భయంకరంగా చూపించారని ఇలా నా పాత్ర ఉంటుందని తెలిస్తే తాను ఈ సినిమా చేసే వాడిని కాదు అంటూ మోహన్ బాబు తెలిపారు. ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత కచ్చితంగా చేయాలి కనుక ఈ సినిమా చేశానని తెలిపారు. తాను ఒక డైలాగ్ చెప్పాలి అంటే నేను ఎంత కోపం ప్రదర్శించాలి అనే విషయాన్ని కూడా శ్రీకాంత్ నాకు చెప్పారు. షర్టు లేకుండా నటించమన్నారు. నా కెరియర్ లో మూడు సినిమాలలో మాత్రమే ఇలా నటించాననీ మోహన్ బాబు తెలిపారు.
ఇకపోతే నేను ఒక సీన్ చేసేటప్పుడు శ్రీకాంత్ నా నుంచి పది టేక్స్ తీసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు నా దగ్గర అన్ని టేక్స్ తీసుకున్న డైరెక్టర్ మా గురువుగారు దాసరి నారాయణరావు (Dasari Narayanarao) తప్ప మరెవరూ లేరని ఇప్పుడు శ్రీకాంత్ నా చేత అన్ని టేకులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఎందుకు గురువుగారు ఇన్ని టేకులు తీసుకుంటున్నారని నేను తనని ప్రశ్నించగా.. నీళ్లు ఎంత తోడితే అంత వస్తుంటాయి అలాగే నీలో అసలైన నటుడు బయటకు వస్తాడని ఇన్ని టేకులు తీసుకుంటున్నాను అంటూ అప్పుడు గురువుగారు చెప్పేవారు. ఇలా దాసరి గారు తరహాలోనే శ్రీకాంత్ కూడా నా చేత ఎక్కువ టేకులు తీసుకున్నారని మోహన్ బాబు తెలిపారు.
శ్రీకాంత్ పనితీరు చూస్తుంటే ఆయన ఎప్పటికైనా ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అవుతారని మోహన్ బాబు తెలిపారు. ఇన్ని సంవత్సరాలు సినిమాలలో నేను నటించినా, ఈ సినిమా సెట్టులో తాను ఎన్నో గుణపాటాలు నేర్చుకున్నానని తెలిపారు. ఒక నటుడిగా శ్రీకాంత్ ప్రతిభను చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela)పై మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మళ్లీ నీ సినిమాలలో నాకు అవకాశం ఇస్తే ఇలాంటి భయంకరమైన పాత్రలు మాత్రం ఇవ్వద్దని మోహన్ బాబు కోరారు.
Also Read: ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదు.. మోహన్ బాబు కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?