SAVE System: ట్రంప్ గవర్నమెంట్‌కు అమెరికా సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఓటర్ల జాబితాలను సెంట్రల్ డేటాబేస్‌తో సరిపోల్చి, పౌరసత్వం తనిఖీ చేసే SAVE సిస్టమ్‌ని తిరిగి వాడుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్‌లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ తీర్పుపై అమెరికాలో ఫుల్ డిబేట్ నడుస్తోంది.
గత జూన్‌లోనే ఈ సేవ్ వ్యవస్థను ఓ ఫెడరల్ న్యాయమూర్తి నిలిపివేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వును పక్కనపెట్టేసింది. అమెరికన్ పౌరుల గోప్యత హక్కులను ప్రభుత్వం తొక్కేసిందని ఓ జిల్లా జడ్జి అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇప్పటికే సుమారు 27 రాష్ట్రాలు.. ఈ ధృవీకరణ కోసం చేరాయి. గతేడాది మే నుంచి ఆరున్నర కోట్ల మందికి పైగా ఓటర్లను పౌరులుగా ధ్రువీకరించారు. ఇందులో.. దాదాపు 29 వేల రికార్డులను అనుమానాస్పదంగా గుర్తించారు. అయితే.. ఇక్కడే అసలు వివాదం తలెత్తుతోంది. ఈ వ్యవస్థ.. తప్పులు చేస్తోందని విమర్శలు ఆరోపిస్తున్నారు. టెక్సాస్‌లోని ట్రావిస్ కౌంటీలో.. అనుమానితులుగా గుర్తించిన వారిలో 25 శాతం మంది అప్పటికే అమెరికా పౌరులేనని కోర్టులో పిటిషనర్లు వాదించారు.
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం మాత్రం.. ఇది ఎన్నికల విశ్వసనీయత కోసమే అంటోంది. ఇంకొన్ని సంస్థలు మాత్రం.. లక్షలాది మంది ఓటర్లు అన్యాయంగా ఓటర్ జాబితా నుంచి తొలగిపోతారని హెచ్చరిస్తున్నాయ్. అయితే, భారత సంతతి పౌరులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎన్నికలకు ముందు 90 రోజుల ముందు భారీగా ఓటర్ల పేర్లు తొలగించడంపై ఫెడరల్ చట్టం ఆంక్షలు విధిస్తోంది. కాబట్టి, ఈ ఎన్నికలపై తక్షణ ప్రభావం పరిమితమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందే తుది తీర్పు కాదు. ప్రధాన కేసు ఇంకా కోర్టుల్లోనే ఉంది. జాబితా నుంచి తొలగింపునకు ముందు.. ఓటర్‌కు నోటీసు, వివరణ ఇచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మిడ్‌టర్మ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఈ డేటాబేస్ ఎవరి ఓటుకు గండి కొడుతుందన్నదే ఆసక్తి రేపుతోంది.
Also read: అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం.. అడుగు వేయాలంటే జంకుతున్న జనం!