SIIMA Awards 2026: దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సెలబ్రిటీలు భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2026 వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా రెండు రోజులపాటు ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. మొదటిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ తారలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 12 , 13 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అటు తెలుగు చిత్రాలు, తెలుగు సెలబ్రిటీలు సత్తా చాటారు.
గత ఏడాది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు, అద్భుతమైన నటన కనబరిచిన నటీనటులు , తమ ప్రతిభతో సినిమాలకు మరింత బలాన్ని చేకూర్చిన సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలలో పురస్కారాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈసారి తేజ సజ్జా(Teja sajja) నటించిన ‘మిరాయ్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడు విభాగంలో అవార్డును సొంతం చేసుకున్నారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నా తేజ కు సైమా వేదికపై ఉత్తమ నటుడిగా ఈ పురస్కారం దక్కడంతో అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.
మరొకవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో భాగ్యం పాత్రతో తనదైన నటనను కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ కి కూడా ఈ పురస్కారం లభించింది. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న బుల్లిరాజుకి ఉత్తమ సహాయ నటుడు విభాగంలో అవార్డు అందించారు. ఇక ఈ సినిమాలోని హాస్య సన్నివేశాలలో బుల్లిరాజు పాత్ర చాల ప్రత్యేకంగా నిలిచింది.
also read:అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!
సత్తాచాటిన సంక్రాంతికి వస్తున్నాం..
ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంగీత విభాగంలో కూడా మరిన్ని అవార్డులు అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా రమణ గోగుల అవార్డును అందుకున్నారు. అలాగే కోర్ట్ చిత్రానికి గాను సమీరా భరద్వాజ్ ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును సొంతం చేసుకున్నారు. మొత్తానికి అయితే దక్షిణాది సినీ పరిశ్రమ ప్రతిభను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే సైమా వేడుకలు.. ప్రతి ఏడాది సినీ అభిమానులలో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తుంటాయని చెప్పవచ్చు.