Sistla Preschool:మణికొండలో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకు సినీ నటుడు రాజీవ్ కనకాల, నటి వితికా షేరు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం విశేషం.
గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్.. చిన్నారులకు చదువుతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సృజనాత్మకతను నేర్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే సరైన విద్య అందిస్తే, వాళ్ల భవిష్యత్తుకు మంచి పునాది పడుతుందనే ఆలోచనతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాదిలోనే వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు తమ ప్రతిభను చూపిస్తూ సందడి చేయడంతో వేడుకలకు వచ్చిన అతిథులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి మాట్లాడుతూ.. సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. చైర్మన్ లోహిత్ సిస్ట్లాకు విద్యారంగంపై మంచి అవగాహన ఉందని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని చెప్పారు. చిన్నారులకు చదువు చెప్పడంతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ నేర్పించడం కూడా చాలా ముఖ్యమని తెలిపారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. స్కూల్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. పిల్లలకు ఎలాంటి విద్య అందించాలి? వాళ్లను ఎలా తీర్చిదిద్దాలి? అనే విషయాలపై తన అభిప్రాయాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు.
అయితే స్కూల్‌కు సంబంధించిన ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత తాను చెప్పాలనుకున్న చాలా విషయాలు ఇప్పటికే అక్కడ అమలు చేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ రాబోయే 25 ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించాలని, ఎంతోమంది పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకున్నారు.
ఇక నటి వితికా షేరు మాట్లాడుతూ.. స్కూల్‌లో చిన్నారులను చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల రోజులు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహం, చిన్నప్పటి నుంచి ఆమె తీసుకున్న జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. పిల్లలు చిన్నప్పటి నుంచే మంచి వాతావరణంలో పెరిగితే, తమకు నచ్చిన రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు.
స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా మాట్లాడుతూ.. తన చిన్ననాటి అనుభవాలే ఈ స్కూల్‌ను ప్రారంభించడానికి కారణమయ్యాయని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో తనకు నచ్చిన విధంగా నేర్చుకునే అవకాశం ఉంటే బాగుండేదని అనుకునేవాడినని తెలిపారు. పిల్లల ఆసక్తులు, అభిరుచులకు అనుగుణంగా విద్య అందించాలనే ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వివరించారు. ఇతర వ్యాపారాలతో పోలిస్తే ఈ స్కూల్‌తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తొలి వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
ALSO READ :జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!
ఇక ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి. కూచిపూడి నృత్య నిర్వాహకురాలు శోభ గోపు ఆధ్వర్యంలో కౌస్తుభ కూచిపూడి బృందం ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.స్కూల్ ప్రిన్సిపల్ మోఘోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.