Sowcar Janaki:గత కొన్ని రోజులుగా అస్వస్థతతో మంచాన పడ్డ షావుకారు జానకి తాజాగా కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.ఇక ఆమె మరణించిందన్న వార్త తెలియడంతో అటు ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే అలనాటి తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని దగ్గరుండి చూసిన ఈ ‘శంకరమంచి జానకి’ కాస్తా ‘షావుకారు జానకి’గా ఎలా మారిందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు సినీ అభిమానులు,మరి శంకర మంచి నుండి షావుకారు గా ఎలా మారారో ఒకసారి చూసేద్దాం.
శంకర మంచి జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు.ఇక చిన్న తనంలోనే కళలపై ఉన్న ఇష్టంతో ఆకాశవాణి (రేడియో) నాటకాల్లో పాల్గొంటూ తన మాటా, ఆటలతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.ఇక అదే సమయంలో ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే ఉంది.దాంతో తనకు కళల పట్ల ఇష్టం వల్ల నటించాడనికి మొగ్గు చూపింది జానకి. సరిగ్గా అదే సమయంలో విజయా ప్రొడక్షన్స్ వారు తాము తెరకి ఎక్కించే సరికొత్త సినిమాలో నటించే కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారు.దర్శక దిగ్గజం ఎల్.వి. ప్రసాద్.అలా జానకిలోని ప్రతిభను గుర్తించి, ఆమెకు ఆ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చారు.
అలా మొదటగా చేసిన సినిమానే ‘షావుకారు’.1950 ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఎన్టీఆర్ హీరోగా నటించగా జానకి ‘సుబ్బులు’ అనే గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టారు.ముఖ్యంగా సినిమా కమర్షియల్ గా అంతంతమాత్రమే అయినప్పటికీ జానకి నటనని చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.ఎంతలా అంటే శంకరమంచి జానకిని ‘షావుకారు జానకి’ అని పిలిచేంత.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదట్లో ‘షావుకారు’ అనే పదం క్రమక్రమంగా ‘సౌకార్’ లేదా ‘సోవ్‌కార్’ అనే రూపంలో కూడా పాపులర్ అయింది. కానీ తెలుగు ప్రేక్షకుల నోట మాత్రం ‘షావుకారు జానకి’అనే పేరు అలా స్థిరపడిపోయింది.
ఇక ‘షావుకారు’ ఇచ్చిన గుర్తింపుతో ఆమె కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు జానకి. 1953లో ‘పిచ్చి పుల్లయ్య’, 1954లో ‘వద్దంటే డబ్బు’, 1955లో వచ్చిన ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’ వంటి చిత్రాలు ఆమెలోని నటిని మరో మెట్టు ఎక్కించాయి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన ‘రోజులు మారాయి’ చిత్రం 25 వారాలకు పైగా ఆడి సిల్వర్ జూబ్లీ విజయంతో అప్పట్లో చరిత్ర సృష్టించింది.
తెలుగులోనే కాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా ఆమె చెరగని ముద్ర వేశారు. 1952లో ‘వలయాపతి’తో తమిళంలో అడుగుపెట్టిన ఆమె పానం పడుత్తుమ్ పాడు, పుధియా పారవై, నీర్కుమిళి, ఎదిర్ నీచల్, ఇరుకోడుగల్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసింది.అలా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు.
అయితే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత కూడా ఆమె పక్కకు తప్పుకోకపోవడం చూస్తే సినిమా రంగంపై ఆమెకున్న మమకారం ఎలాంటిదో అర్థం అవుతుంది. వయసుకు తగ్గట్టుగా తల్లి, అత్త, నానమ్మ, ఇంటి పెద్ద వంటి విభిన్నమైన క్యారెక్టర్ రోల్స్‌లో నటించి మెప్పించారు.ఒకరకంగా ఏడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఆమె సినీ ప్రయాణంలో వందల సినిమాల్లో నటించడమంటే సాధారణ విషయమేమీ కాదు.
ఇక ఆ తరంలోనే కాకుండా నేటి తరం సినిమాలైన ‘కంచె’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘సౌఖ్యం’లతో పాటు 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ వరకు ఆమె తన నటనతో అలరిస్తూనే వచ్చారు.ఇక జానకి సినిమాల పరంగా చూస్తే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో కలిపి దాదాపు 385 సినిమాల్లో నటించిన జానకి 3 హిందీ సినిమాలలోను, ఒక మలయాళం సినిమాలోనూ నటించడం విశేషం,ఇక ఆణిముత్యాల లాంటి ఎన్నో సినిమాలతో అలరించిన కృష్ణకుమారి ఈమెకి స్వయానా చెల్లి కావడం ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం.
also read :పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్
ఏది ఏమైనా ఏడు దశాభ్దాలు గడిచినా మొదటి సినిమా పేరునే చివరి కంటా నిలిచిపోవడం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టమనే చెప్పాలి.