Karikaala Movie”అందరూ కత్తులు పట్టేస్తున్నారు.. నేనెందుకు పట్టకూడదు” అనుకున్నాడో ఏమో సందీప్ కిషన్. అందుకే నేనూ ఆ బాటలోనే అంటూ తాజాగా ‘కరికాల’ అనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ పోస్టర్ గురించే డిస్కషన్.
ఆ పోస్టర్ చూస్తే సందీప్ కిషన్ ఒక పవర్‌ఫుల్ యోధుడిలా కనిపిస్తున్నాడు.చేతిలో కత్తి.. గుర్రంపై యుద్ధానికి వెళ్తున్న లుక్.. వెనకాల వార్ బ్యాక్‌డ్రాప్.. పక్కనే సింహం.. చూస్తుంటే సినిమా స్కేల్ సాలిడ్‌గానే ఉండేట్టు కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ‘శంబాల’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యుగంధర్ ముని వ్యవహరించబోతున్నాడు.
అయితే సినిమా ఒక పార్ట్ కాకుండా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్.’కరికాల – చాప్టర్ 1’ను 2027 జూలై 2, ‘కరికాల – చాప్టర్ 2’ను 2027 అక్టోబర్ 28న రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
నిజంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను కేవలం రెండు నెలల గ్యాప్‌లో రెండు భాగాలుగా రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే.. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘కరికాల’ మరో ఎత్తు అని చెప్పవచ్చు.ఎందుకంటే పీరియాడికల్ స్టోరీ.. భారీ వార్ సీక్వెన్స్‌లు.. రాజుల బ్యాక్‌డ్రాప్.. ఇలా ఇవేవీ ఆయన ఇంతకుముందు చేయలేదు.ఇక ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నారట సందీప్ కిషన్.
అయితే ఇదిలా ఉంటే.. ఈ మధ్య హీరోలందరూ పీరియాడికల్ సినిమాల మీదే మోజు పెంచుకుంటున్నారు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద డిబేట్‌గా మారిపోయింది.ఒకప్పుడు హీరో అంటే రెండు పాటలు పాడామా.. నాలుగు ఫైట్లు చేసామా.. ఆరు కామెడీ సీన్లతో నవ్వించామా అన్నట్టుగా ఉండేది.
కానీ ఎప్పుడైతే సినిమా బోర్డర్స్ దాటి పాన్ ఇండియా బాట పట్టిందో.. అప్పటినుంచి మన హీరోలు కూడా కత్తి పట్టడం మొదలెట్టారు. వాళ్ల స్థాయిని ఆ కత్తే పెంచేస్తుందని ఫిక్స్ అయినట్టున్నారు.బహుశా ‘బాహుబలి’ ఎఫెక్ట్ కావచ్చు.
ఒకవైపు సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, మరోవైపు నిఖిల్ ‘స్వయంభు’ సెట్స్ మీద పరుగులు తీస్తుంటే.. ఆల్రెడీ ‘మిరాయి’తో సూపర్ హిట్ కొట్టాడు తేజ సజ్జ.
మొత్తానికి మన తెలుగు హీరోల మైండ్‌సెట్ ఎలా ఉందంటే.. కోటలు, కిరీటాలు, కత్తులు, గుర్రాలు.. ముందర మంటలు.. వెనకాల పొగలు.. ఇవి కచ్చితంగా ఉండాలి అన్నట్టుగా తయారైంది.
అయితే ఇక్కడ హీరోలు అర్థం చేసుకోవాల్సింది గుర్రాలు, కత్తులు, మంటలు, పొగలు కాదు.. కథ ఎంత సాలిడ్‌గా ఉందన్నదే ముఖ్యం.‘బాహుబలి’ బయటికి గ్రాండియర్‌గా కనిపిస్తుందేమో.. కానీ దాని లోతులకు వెళ్తే అంతకు మించిన కథ ఉంది. దాన్నే పట్టుకున్నాడు జక్కన్న.
సో.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కాకుండా.. వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ముందుగా కథ మీద ఫోకస్ చేస్తే మరింత మంచిది.లేదంటే విజువల్స్ ఎంత గ్రాండ్‌గా ఉన్నా.. కథలో బలం లేకపోతే మాత్రం ఆడియన్స్ ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోతాడు.
చూడాలి మరి.. పీరియాడికల్ మోజులో పడిన సందీప్ కిషన్‌ను ఈ ‘కరికాల’ ఏ రేంజ్‌కి తీసుకెళ్తుందో!
also read :సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!