Police Complaint OTT: హారర్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ కొన్ని చిత్రాలు భయపెట్టడమే కాదు, కథలో దాగిన మిస్టరీతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటే ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint 2026). స్టార్టింగ్ లో ఇది సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లా అనిపించినా, కథ ముందుకు సాగేకొద్దీ చేతబడి, నరబలి, ప్రతీకారం వంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడిలో కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తూ, చివరి వరకు సస్పెన్స్ ఫుల్ గా కొనసాగుతుంది. థియేటర్లలో విడుదలైన ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి దీన్ని ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణమైన ఘటనతో కథ ప్రారంభమవుతుంది. అమరత్వం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిన మహంకాళి అనే క్రూరమైన మాంత్రికుడు ఒక గర్భిణీ స్త్రీని అత్యంత దారుణంగా నరబలి ఇస్తాడు. కానీ ఆ హత్య వెనుక ఉన్న అసలు నిజం బయట పడకుండా ఉండేందుకు తన శక్తిని ఉపయోగిస్తాడు. ఈ వ్యవహారంలో అతడికి ఒక అవినీతి పోలీస్ అధికారి, మరో లంచగొండి డాక్టర్ అండగా నిలుస్తారు. గర్భిణీ హత్యను గౌరవ హత్యగా చిత్రీకరిస్తూ తప్పుడు ఆధారాలు సృష్టించి కేసును పూర్తిగా మూసివేస్తారు. నిజం అక్కడితో సమాధి అయిపోయిందని అందరూ భావిస్తారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఏసీపీగా వరలక్ష్మి శరత్‌కుమార్ రంగంలోకి దిగుతుంది. పాత కేసులను పరిశీలించే క్రమంలో ఈ మిస్టీరియస్ కేసు ఆమె దృష్టిలో పడుతుంది. మొదట ఇది సాధారణ హత్య కేసులా కనిపించినా, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఊహించని విషయాలు బయటపడతాయి.
ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరిగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం మరింత కలకలం రేపుతుంది. ఇది యాదృచ్ఛికమా? లేక ఎవరో పథకం ప్రకారం ప్రతీకారం తీర్చుకుంటున్నారా? చేతబడి నిజంగానే ఉందా? లేక దీని వెనుక మరో పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుడిని చివరి వరకు వెంటాడుతాయి.
కేసు వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయడానికి ఏసీపీ చేసే పోరాటం, ఆమె ఎదుర్కొనే ప్రమాదాలు, నేరస్థులు చేసిన పాపాలకు కర్మ ఎలా సమాధానం చెప్పింది ? వంటి అంశాలను దర్శకుడు సస్పెన్స్‌తో మేళవించి చూపించాడు. కీలక ట్విస్టులు, క్లైమాక్స్‌లో వచ్చే పరిణామాలను మాత్రం తెరపై చూసి ఆస్వాదిస్తేనే అసలు థ్రిల్ తెలుస్తుంది.
‘పోలీస్ కంప్లైంట్’లో వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంటారు. నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి కీలక పాత్రలు పోషించారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌తో పాటు కన్నడ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. హారర్‌తో పాటు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లను ఆస్వాదించే వారికి ఇది వర్త్ వాచింగ్ మూవీ. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడే మూవీ లవర్స్‌కు బెస్ట్ ఆప్షన్.
Read Also: స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్