Tollywood: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు కూడా ఈ సమస్యపై స్పందించి సరైన న్యాయం కావాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈమధ్య తాము ఎవరి చేత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనే విషయాలను కూడా బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా ఒక టాలీవుడ్ నటి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్లు చేయడమే కాకుండా.. ఇటీవల ఒక భారీ బడ్జెట్ మూవీ నుంచి తప్పించారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇండస్ట్రీలోకి అలా వచ్చాను..
ఆమె ఎవరో కాదు దీక్ష పంత్ (Diksha panth). రచ్చ, వరుడు, ఒక లైలా కోసం, గోపాల గోపాల వంటి చిత్రాలలో నటించిన ఈమె ‘మంగమ్మ’ అనే ప్రైవేట్ సాంగ్ తో ప్రేక్షకులను మరింత అలరించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని ఊహించని పాపులారిటీ అందుకున్న ఈ చిన్నది ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే దీక్ష పంత్ మాట్లాడుతూ.. “మాది ఉత్తరాఖండ్.. నాన్న రైల్వే ఉద్యోగి కావడంతో తరచూ ట్రాన్స్ఫర్స్ ఉండేవి. అలా నేను పుట్టింది విజయవాడలో.. పెరిగింది కాకినాడలో.. చదువుకునే రోజుల్లోనే ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను. ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అయితే ఒక రోజు ఒక ఈవెంట్ లో ఒక కొరియోగ్రాఫర్ నన్ను చూసి మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పాను. రెండేళ్ల తర్వాత మళ్లీ అతడే ఫోన్ చేసి బ్రతిమలాడాడు. ఇంతగా అడుగుతున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం అని.. చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ర్యాంప్ షో చేశాను. అది సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మోడలింగ్ లో బిజీ అయిపోయాను. అక్కడ ఒక పేరు వచ్చిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టాను” అంటూ తెలిపింది దీక్ష పంత్.
కాస్టింగ్ కౌచ్ పై కీలక కామెంట్.. పెద్ద సినిమాలో అవకాశం కోల్పోయా..
క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. “మొదట్లో అవకాశం ఇస్తాము కానీ మాకు నీ నుంచి ఇంకేదో కావాలి అని అడిగేవారు. ముఖం మీద నో చెప్పేదాన్ని. నన్ను రిజెక్ట్ చేసేవారు. అవకాశాల కోసం అందరితో రాసుకు పూసుకు తిరగాలంటే కష్టం. అందుకే నేను సక్సెస్ కాలేదేమో.. గతంలో మంచి హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్.. ఈమధ్య ఒక పీరియడ్ డ్రామా సినిమా కూడా విడుదల చేశారు. 2017లోనే ఆ సినిమా చెయ్యమని అడగగా అంత బాగానే ఉందనుకున్న సమయంలో సడన్గా సినిమా నుంచి తప్పించారు. ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. అంత పెద్ద ప్రాజెక్టు చేజారిపోవడం బాధగా అనిపించింది” అంటూ దీక్ష చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Daksha Teaser: పేరు మార్చుకున్న మంచు లక్ష్మి మూవీ… ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్.. రిలీజ్ అప్పుడే?