Tollywood Releases: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది మన టాలీవుడ్ వ్యవహారం,హిట్స్ ఏవి అంటే ఇప్పటికీ పుష్ప, కల్కి సినిమాలని వల్లే వేసుకోవడమే తప్పించి ఇదీ సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని ఒక్కటీ చెప్పుకోలేని పరిస్థితి. పెద్ది, మా ఇంటి బంగారం వంటి ఒకటి అరా సినిమాలు అడపాదడపా మెరవడం తప్ప సినీ అభిమానుల ఆకలిని, బాక్సాఫీస్ గల్లా పెట్టెలని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిన ఈ సినిమా ఏడు ఇప్పటి వరకు రాలేదంటే ఆశ్చర్యం లేదు. దీంతో మరో రెండు రోజుల్లో ఫస్ట్ హాఫ్(జనవరి నుండి జూన్)కంప్లీట్ అవబోతుండటంతో కనీసం సెకండ్ హాఫ్(జులై నుండి డిసెంబర్)లోనైనా టాలీవుడ్ మునుపటి వైభవాన్ని చూసే సినిమా వస్తుందా లేదా అనే లెక్కలు వేసే పనిలో పడిపోయారు ట్రేడ్ పండిట్స్.
అలా ఒకసారి ఈ జులై నుంచి ఆడియన్స్ ని అలరించడానికి, బాక్సాఫీస్ పై అటాక్ చేయడానికి వస్తున్న ఆ బడా సినిమాలని చూస్తె ముందుగా కనిపించేది మెగాస్టార్ చిరంజీవే. అవును …అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాల పాట పాడుతున్న ఈ సినిమా ఈ ఆగస్ట్ లో రాబోతుందన్న వార్త గట్టిగానే వినిపిస్తుంది. అసలే 200కోట్ల భారీ బడ్జెట్, పైగా విమర్శకులకి పని పెట్టిన నాసిరకమైన vfx, పై పెచ్చు దాదాపు రెండేళ్లుగా అభిమానులని ఊరిస్తూ ఊరిస్తూ పాత బడిపోయిన సినిమా. మరి బాక్సాఫీస్ పై భారీ ఆశలే పెట్టుకున్న టాలీవుడ్ కి ఈ సినిమా ఆ ఆకలి తీరుస్తుందా లేదా అనేది బరిలోకి దిగితే కాని తెలిసేలా లేదు.
ఇక చిరు తర్వాత నాదే అంటూ బాక్సాఫీస్ పై ఖర్చీప్ వేసేశాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. టాక్సీవాలా వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న రాబోతుందని తెలుస్తుంది. అసలే ప్లాపులతో సావాసం చేస్తున్న రౌడీకి ఇది ఎట్టి పరిస్థితుల్లో హిట్టవ్వాల్సిందే.చూడాలి మరి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ కి ఎలాంటి కబురు అందిస్తుందో.
ఇక ఈ వరుస తర్వాతి స్థానం నాదే అంటున్నాడు హీరో నాని. పెద్దికి పోటీగా మార్చి 26న ప్యారడైజ్ ని తీసుకు వస్తామని మొదట్లో అనౌన్స్ చేసిన మేకర్స్ తర్వాత ఆగస్టు 21కి వెళ్ళిపోయారు.తీరా అబ్బే షూటింగ్ ఇంకా అవలేదంటూ సెప్టెంబర్ 25కు వెళ్ళిపోయాడు.మరి దాదాపు రెండొందల యాబయ్ కోట్ల బడ్జెట్ తో శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అయినా టాలీవుడ్ ఆకలి తీరుస్తుందో లేదో చూడాలి.
ఇక క్రేజీ కాంబోగా పేరు పడ్డ త్రివిక్రమ్-వెంకీలు కలిసి చేస్తున్న ఆదర్శకుటుంబం తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసుకుంది.దసరా స్పెషల్ గా అక్టోబర్ రెండున వచ్చేస్తామంటూ హడావిడి చేస్తున్న వెంకీ మామ ఫ్యామిలీ బాక్సాఫీస్ వద్ద ఆ హడావుడి నిలబెట్టుకుంటుందో చూడాలి.అయితే గతంలో రైటర్ గా త్రివిక్రమ్, హీరోగా వెంకీ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు సూపర్ హిట్ అవడం తో అంచనాలు భారీగానే మోస్తుంది ఈ సినిమా.మరి దాదాపు 170కోట్ల బడ్జెట్ తో రాబోతున్న సినిమా వాటిని అందుకుంటుందా లేదా చూడాలి
ఇక ఇప్పటికైతే దసరాకి ఖర్చీఫ్ వేసుకున్న అక్కినేని నాగార్జున కింగ్ 100 కూడా టాలీవుడ్ ని ఊరిస్తున్నదే. రా.కార్తీక్ దర్శకత్వంలో మోస్ట్ అవైటేడ్ గా వస్తున్న ఈ సినిమాలో టబు చాలా రోజుల తర్వాత నాగ్ తో జత కడుతున్న సంగతి తెల్సిందే. 150 కోట్ల బడ్జెట్ తో కెరీర్ మైల్ స్టోన్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అయితే సినిమా అనుకుంటున్నట్టుగా దసరాకి వస్తుందా లేక నాగ్ కి కలిసొచ్చిన క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందా అనౌన్స్ మెంట్ వస్తే కాని తెలీదు.
ఇక నిఖిల్ కెరీర్లోనే వంద కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ సినిమా ఇప్పటికి పలు డేట్స్ మార్చుకొని సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నదే.వినిపిస్తున్న టాక్స్ ప్రకారం వచ్చే దసరాకి రానుందని తెలుస్తుంది. ఏది ఏమైనా భారీ బడ్జెట్లతో వారి వారి కెరీర్ లలోనే ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలపైనే టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. చూడాలి వీటిలో ఏవి నిలబడతాయో, ఏవి పడిపొతాయో !