Percentage System: మూడు అడుగులు ముందుకేస్తే ముప్పయ్ అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది పర్సంటేజీ పంచాయితీ.మొన్నటికి మొన్న అంతా కలిసిపోయి సమస్య సాల్వ్ అయిపోయింది అన్నట్టుగా కవరింగ్ ఇచ్చారు టాలీవుడ్ పెద్దలు,కానీ అబ్బే అంత సీన్ లేదంటూ తాజాగా నేడు మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు అత్యవసరంగా భేటీ కావడం, నిర్మాతలకు ఏకంగా అల్టిమేటం జారీ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఓటీటీల హవా, మరోవైపు భారీగా పెరిగిపోయిన థియేటర్ల మెయింటెనెన్స్ లతో డీలా పడ్డ ఎగ్జిబిటర్లు.. ఇకపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘రెంటల్ సిస్టమ్’ పై తీవ్ర ఆగ్రహం
ఈ కీలక సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, హైదరాబాద్‌లోని ప్రముఖ సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ థియేటర్ల యాజమానులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ‘పర్సంటేజీ విధానం’ (టికెట్ వసూళ్లలో వాటా ) విజయవంతంగా నడుస్తుంటే, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎగ్జిబిటర్లపై ‘రెంటల్ సిస్టమ్’ (ఫిక్స్‌డ్ అద్దె పద్ధతి) రుద్దడం ఏంటని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదు
గతంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్స్ మరియు షూటింగ్స్ జోరుగా సాగుతున్న సమయంలోనే ఈ సమస్యపై పెద్దలు స్పందించారు. కేవలం రెండు నెలల్లోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఛాంబర్ కమిటీ హామీ ఇచ్చింది. కానీ ఏడాది దాటిపోతున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో సెక్రటరీ శ్రీధర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విడుదల కానున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి తమకు కచ్చితంగా పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేయాలని, లేకపోతే కొత్త సినిమాలను థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదని వారు ఖరాఖండిగా చెప్పారు.
పరిశ్రమ పెద్ద మనిషిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు తమకు కలిసే అవకాశం ఇవ్వాలని, ఆయన పర్మిషన్ ఇస్తే తామంతా కలిసి తమ గోడు చెప్పుకుంటామని, తమ సమస్యలను వివరిస్తామని పేర్కొన్నారు. అలాగే, ఏ థియేటర్స్ బాగుంటే ఆ థియేటర్లకే డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలు ఇస్తారనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
also read :ఎమోషనల్ పోస్ట్ ఓకే.. కానీ ‘కింగ్ 100’ అప్‌డేట్ ఎక్కడ .. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఈ సందర్భంగా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర గోపాల్ మాట్లాడుతూ, థియేటర్ల సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు విడుదలయ్యే ముందే తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, ఇకపై పెద్ద సినిమా రిలీజ్‌కు ముందే తమకు రాతపూర్వకమైన లేఖ ఇవ్వాలని, అప్పుడే ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు.
దాదాపు 14 రకాలుగా ఆదాయ మార్గాలు
ఇక ఇదే విషయమై సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్ మాట్లాడుతూ.. నిర్మాతలకు థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ హక్కులు, శాటిలైట్, హిందీ డబ్బింగ్, ఆడియో రైట్స్, డిజిటల్ ఇలా దాదాపు 14 రకాలుగా ఆదాయ మార్గాలు పెరిగాయని గుర్తుచేశారు. కానీ థియేటర్లు నడిపే ఎగ్జిబిటర్లకు మాత్రం కేవలం టికెట్ వసూళ్లు, క్యాంటీన్ మాత్రమే ఆధారం అని, ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్టీ, భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు, మెయింటెనెన్స్ భారమై తెలంగాణ వ్యాప్తంగా సుమారు 120 మంది థియేటర్ల ఓనర్లు అప్పులపాలు కావాల్సిన దీనస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేడింగ్ అనేది కేవలం ఒక కుంటి సాకు మాత్రమేనని, థియేటర్ల గ్రేడింగ్ అనేది అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదే సందర్భంలో దేశంలో వచ్చిన డిజిటల్ మార్పులను ప్రస్తావిస్తూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బ్యాంకు లావాదేవీల్లో పూర్తి పారదర్శకత వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
పెద్ది పై పెద్ద గుది బండ పడుతుందా ?
ఓటీటీల ఎఫెక్ట్ వల్ల గత రెండు మూడేళ్లుగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోయిందని, సినిమా ఫ్లాప్ అయితే భారీగా నష్టపోవాల్సి వస్తోందని వారు వాపోయారు. ఇకపై తమ డిమాండ్లను అంగీకరిస్తూ పర్సెంటేజ్ సిస్టమ్ ప్రకటిస్తేనే సినిమాలు ఆడిస్తామని, లేదంటే థియేటర్లను శాశ్వతంగా మూసుకోవడం మినహా మరో మార్గం లేదని ఎగ్జిబిటర్లు తెగేసి చెప్పారు. ఈ ఉత్కంఠభరిత వాతావరణం నడుమ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కూడా ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఈ మీటింగ్ ని పరిశీలిస్తే జూన్ 4న రావాల్సిన పెద్ది పై పెద్ద గుది బండ పడేలానే కనిపిస్తుంది.చూడాలి పర్సంటేజీ ఇవ్వాల్సిందే అంటున్న ఎగ్జిబిటర్స్,ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అంటున్న ప్రొడ్యూసర్స్ మధ్యలో పెద్ది ఎలా బయటపడుతుందో !