V.K.Naresh:దివంగత నటీమణి, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల (Vijaya Nirmala) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వీ.కే.నరేష్ (V.K.Naresh). మొదట్లో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇకపోతే నరేష్ సినిమాల కంటే వ్యక్తిగత వార్తలతోనే నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్తలు గతంలో జోరుగా వినిపించాయి. ముఖ్యంగా ప్రముఖ నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) తో సహజీవనం చేస్తున్నారని వార్తలు రాగా.. అదే సమయంలో ఆమెతో పబ్లిక్ లో ఆయన చట్టాపట్టాలేసుకొని తిరగడంతో అందరూ నిజమే అనుకున్నారు. ఒకానొక సమయంలో ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలన్నీ సమిసిపోయిన విషయం తెలిసిందే.
కెరియర్ పై ఫోకస్ పెట్టిన నరేష్..
ఇకపోతే ఇప్పుడు కెరియర్ పై ఫోకస్ పెట్టిన నరేష్ రూట్ మార్చినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలలో ఎక్కువగా నటించారు. ఈయన తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు కామెడీ రోల్స్ కే పరిమితం కాకుండా సెంటిమెంట్, యాక్షన్, ఎమోషనల్ చిత్రాలలో కూడా నటించి పేరు దక్కించుకున్న ఈయన.. ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు కూడా.
జోరు పెంచిన నరేష్..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా నారా రోహిత్ (Nara Rohit), శ్రీదేవి సాహా జంటగా నటించిన చిత్రం ‘ సుందరాకాండ’. ఈ సినిమాలో నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా ‘ మాస్ జాతర’ మూవీతో పాటు ఈ సినిమా కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టిన చిత్ర బృందం జోరుగా సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన నరేష్.. తాను రూట్ మార్చుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.
విలన్ పాత్ర చేయబోతున్నాను – నరేష్
నరేష్ మాట్లాడుతూ.. “నాకు ఇప్పటివరకు కామెడీ నటుడుగా మంచి పేరు ఉంది. రంగస్థలం తర్వాత ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా నాకు ఇష్టమే. నేను బాగా చేయగలను అని అందరూ గుర్తించారు కూడా.. ముఖ్యంగా నా పాత్రలో కొత్త దనం ఉండాలని కోరుకుంటాను. నాలుగు రసాలను పండించే ఒక విచిత్రమైన పాత్ర కూడా చేస్తున్నాను.. అన్నిటికీ మించి ఒక పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించబోతున్నాను” అంటూ తెలిపారు..అయితే ఆ ప్రాజెక్టులో హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనే విషయాలు మాత్రం ఆయన గోప్యంగానే ఉంచారు. మొత్తానికి అయితే ఇన్ని రోజులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేష్ ఇప్పుడు విలన్ గా యూ టర్న్ తీసుకోబోతున్నారు. మరి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
ALSO READ:Shahrukh Khan: ఇక చాలు రిటైర్మెంట్ తీసుకో.. నెటిజన్ ట్రోల్ కి షారుక్ దిమ్మతిరిగే ఆన్సర్!