Viswanath & Sons Trailer Review:కావాలి ..ఒక్క సాలిడ్ హిట్ కావాలి అంటూ ఎన్నేళ్ళగానో ఎదురుచూస్తున్నాడు సూర్య. కరుప్పు వచ్చి సూపర్ హిట్ అయినా అది కాస్తా కోలీవుడ్ కే పరిమితమైంది. దీంతో ఇలా కాదంటూ సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస సినిమాలతో జోరు మీదున్న వెంకీ అట్లూరితో జత కట్టి విశ్వనాథ్ & సన్స్ అనే సినిమాని పట్టాలెక్కించాడు. ఇక ఈ కాంబో కుదిరింది అన్న వార్త రావడం తోనే ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటికే టీజర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్‌తో ఒక్కసారిగా ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం ఒక లవ్ స్టోరీ కాదు.. క్లాస్ ఫ్యామిలీ డ్రామా, బలమైన ఎమోషన్స్, స్టైలిష్ విజువల్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసిన ప్యాకేజ్ లా కనిపిస్తోంది.
ట్రైలర్ మొదట్లోనే “మా బాబుకి పిస్టల్ షూటింగ్ నేర్పించండి.. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలి”అనే డైలాగ్‌తో కథ ఏ స్థాయిలో ఉండబోతోందో దర్శకుడు చెప్పేశాడు. ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన విశ్వనాథ్ జీవితంలో అనుకోని సమస్య రావడం.. ముఖ్యంగా తన కొడుక్కి ఎదురయ్యే ఆరోగ్య సమస్యతో కథ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకొబోతుందని తెలిసిపోతుంది. ఇక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఏకంగా శాన్‌ఫ్రాన్సిస్కో వరకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం కథపై మరింత ఆసక్తిని పెంచిందనే చెప్పాలి.
అయితే సినిమా కేవలం ఎమోషన్స్‌కే పరిమితం కాలేదు. హీరో చెప్పే “మన డబ్బు, స్టేటస్ మనకు సౌకర్యం అవ్వాలి.. అహంకారం కాకూడదు” అనే డైలాగ్ ట్రైలర్‌లోనే బాగా హైలైట్ అయింది. డబ్బు ఉన్నా విలువలు మర్చిపోని వ్యక్తిగా సూర్య పాత్రను డిజైన్ చేసిన తీరుకి వెంకీని మెచ్చుకోవాలి.
ఇక మమిత బైజు పాత్ర కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషించినట్టే కనిపిస్తుంది. ఆమె ఎంట్రీ తర్వాత విశ్వనాథ్ జీవితంలో జరిగే మార్పులు ఏంటి..? ఇద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం ఏంటి అన్న క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఇక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్‌గా అనిపించగా ప్రేమ, బాధ్యత, కుటుంబం అనే మూడు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇక ట్రైలర్‌లో వచ్చిన “మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక”అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలేషన్‌షిప్స్ గురించి చెప్పిన ఈ ఒక్క మాట ట్రైలర్‌లోనే బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక చూస్తుంటే సినిమా విడుదలయ్యాక ఈ డైలాగ్ మరింత ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్‌లో మరో సర్‌ప్రైజ్ ఏంటంటే వింటేజ్ కార్ల హంగామా. మెర్సిడెజ్ బెంజ్ 540K, పొర్షే, డీలోరెన్ వంటి అరుదైన లగ్జరీ కార్లు కనిపించడం విజువల్‌గా సినిమాకు మరింత రిచ్ లుక్ తీసుకొచ్చింది. అదే సమయంలో “చంద్రముఖిలో జ్యోతికలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావ్?”అనే డైలాగ్ ఒక్కసారిగా నవ్వులు పూయిస్తుంది. అంటే ఎమోషన్స్‌తో పాటు మంచి హ్యూమర్ కూడా సినిమాలో ఉంటుందని ట్రైలర్ క్లియర్‌గా చెప్పేసింది.
జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. వెంకీ అట్లూరి సినిమాలకు ఉండే క్లాస్ టచ్ ఇందులో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రైలర్ చివర్లో వచ్చే “గెలిచిన తర్వాత గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ ఒక్క మాటతో హీరో క్యారెక్టర్‌లోని మెచ్యూరిటీని కూడా దర్శకుడు చూపించాడు.
మొత్తానికి ‘విశ్వనాథ్ & సన్స్’ట్రైలర్ చూస్తే ఒకవైపు లగ్జరీ లైఫ్ , మరోవైపు హార్ట్ టచింగ్ ఎమోషన్స్, తండ్రి-కొడుకుల అనుబంధం, ప్రేమ, రిలేషన్‌షిప్ ఫిలాసఫీ, కామెడీ, స్టైలిష్ విజువల్స్, వింటేజ్ కార్ల హంగామా.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అందంగా కలిపిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతోంది. చూడాలి మరి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆ ఫీల్‌ని ఎలా డీల్ చేస్తుందో!