Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగులుతోంది. మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలున్నారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్‌ను వెంటనే రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
మావోయిస్టులను ఏరేస్తున్నాయి భద్రతా బలగాలు. మావోలకు ఒకప్పుడు కోటగా చత్తీస్‌గఢ్ ఉండేది. వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్- ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 10 మంది మరణించారు.
ఘటన ప్రాంతంలో ఓ ఎస్ఎల్ఆర్ సహా భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్-SOG, ఛత్తీస్‌గఢ్ పోలీసులు-సీఆర్‌పీఎఫ్ టీమ్‌లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్‌లోని కులపరా- ఒరిస్సాలోని నౌపడా అడవుల్లో చోటు చేసుకుంది.
ఒడిషా-ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పోలీసు అధికారులు ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్ర-ఒడిషా సెక్రటరీగా కొనసాగుతున్నాడు.
మావోయిస్టులు భారీ ఎత్తున సమావేశం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు రాష్ట్రాల బలగాలు రెండురోజులుగా కూంబింగ్ నిర్వహించాయి. సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందారు. వారిలో కీలక నేతలున్నట్లు అంతర్గత సమాచారం.
ALSO READ: సీబీఐ వల్లే ఇలా జరిగింది.. కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసంతృప్తి
గతవారం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెల్సిందే. మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణిచివేస్తోంది కేంద్రం. ఛత్తీస్‌గఢ్‌పై కేంద్రబలగాలు ఫోకస్ చేయడంతో మావోల కదలికలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి వేర్వేరు రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
గతేడాది ఒడిషా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎనిమిది మంది అరెస్టు చేయగా, మరో 24 మంది లొంగిపోయారు. కొత్త ఏడాది వచ్చిన మూడు వారాల్లో 13 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి బలగాలు. మొత్తానికి ఛత్తీస్‌గఢ్ లో మావోలు తమ ఉనికి క్రమంగా కోల్పోతున్నారు.