Supreme Court: ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతరులకు మార్గదర్శకాలు ఇచ్చే ముందు మనం అద్దంలో చూసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ అన్నారు. అనర్హత పిటిషన్లపై విచారణలో స్పీకర్ల కాలయాపనపై విచారణ సందర్భంగా ఆయన న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను గుర్తు చేస్తూ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం నమోదైన వ్యాజ్యాలపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్లు ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోకపోవడంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించినా అమలుకు నోచుకోలేదని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ పేర్కొన్నారు. శాసన వ్యవస్థ ఆలస్యాన్ని ప్రశ్నించే సమయంలో న్యాయస్థానాల్లోనూ కేసుల ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. స్పీకర్లకు కఠిన కాలపరిమితి విధించే ముందు కోర్టుల్లో ఉన్న కేసుల పెండెన్సీని కూడా గుర్తించాలన్నారు.
ఇదిలా ఉంటే మరో విచారణలో తెలంగాణలో లోకల్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ తప్పనిసరని తేల్చిచెప్పింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొంది. గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కు స్థానికంగా నాలుగేళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంకిత వేసిన పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. నిబంధన ఏకపక్షంగా ఉందన్న వాదనను జస్టిస్ పీ.ఎస్.నరసింహ ధర్మాసనం కొట్టివేసింది.
Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!
మరో కేసులో డాక్టర్లపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో వైద్యులపై శివసేన కార్పొరేటర్ రమేశ్ మాత్రే దాడికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వైద్య సమాజం జోలికి వస్తే ఊరుకునేది లేదన్న బలమైన సందేశం సమాజంలోకి వెళ్లాలని వ్యాఖ్యానించింది. ‘వైద్యులు ప్రజలకు సేవ చేస్తున్నారు. వారిపై ఇలాంటి దాడులు జరగకూడదు’ Dఅని పేర్కొంది. డాక్టర్ పై దాడి కేసులో నిందితునిగా ఉన్న రమేశ్ మాత్రేను మూడు రోజుల్లోగా కోర్టు సమక్షంలో లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఇది కదా SIP పవరంటే.. రూ. 9 వేలతో రూ. 3 కోట్ల సంపద.. సామాన్యులకు జాక్ పాట్!