LPU Phagwara Protest: పంజాబ్ ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్ ఆవరణలో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలు దావానలంలా వ్యాపించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాలని, క్యాంపస్‌లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనలు చివరకు హింసాత్మకంగా మారాయి.
సెప్టెంబర్ 27 ఆదివారం తెల్లవారుజామున గర్ల్స్ హాస్టల్-3 (GH3)లో ఒక విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడనే వార్త వేగంగా వ్యాపించింది. ప్లంబింగ్ పని కోసం వచ్చిన బయటి వ్యక్తి గదిలోకి ప్రవేశించి వేధింపులకు గురిచేశాడని.. ఈ విషయాన్ని హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ముందుగా హాస్టల్ వద్ద, ఆ తర్వాత యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద గుమిగూడారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారి (NH-44) పైకి చేరుకుని రాకపోకలను అడ్డుకోవడంతో నిరసనలు మరింత ఉదృతంగా మారాయి.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రానికి విద్యార్థుల నిరసనలు మరింత అదుపు తప్పాయి. కొందరు ఆందోళనకారులు యూనివర్సిటీ ఆస్తులను, దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రదర్శన కోసం ఉంచిన మిగ్-23 విమానం, మిలిటరీ ట్యాంక్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఘర్షణ తీవ్రమైంది. విద్యార్థులు రాళ్లు విసరడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి, పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినప్పటికీ తమకు ఎలాంటి ఫిర్యాదు గానీ, ఆధారాలు గానీ సమర్పించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తర్వాత అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఫగ్వారా ఎస్పీ మేజర్ సింగ్ నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా ఈ కమిటీలో డీఎస్‌పీ, మహిళా ఇన్ స్పెక్టర్ తో పాటు విద్యార్థి ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేశారు. సీసీటీవీ పుటేజ్, ఫోన్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలను ప్రస్తుతం సిట్ బృందం సేకరిస్తోంది.
మరోవైపు క్యాంపస్‌లో ఎలాంటి లైంగిక దాడి జరగలేదని LPU యజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ కేవలం పుకార్లేనని కావాలనే నిందలు వేస్తున్నారని ఖండించింది. బాధితురాలిగా ప్రచారం జరుగుతున్న యువతి గదిలోని ముగ్గురు విద్యార్థినుల వీడియోను కూడా యాజమాన్యం విడుదల చేసింది. తమ గదిలో అలాంటి సంఘటనేదీ జరగలేదని సదరు విద్యార్థినులు అందులో పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు కోరిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను, సమాచారాన్ని అందిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
క్యాంపస్‌లో శాంతిభద్రతల దృష్ట్యా సెప్టెంబర్ 28 నుంచి 10 రోజుల పాటు సాధారణ తరగతులను నిలిపివేస్తున్నట్లు యజమాన్యం ప్రకటించింది. జరగాల్సిన మిడ్ టర్మ్ పరీక్షలను కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాయిదా వేసింది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతితో సొంత ఊళ్లకు వెళ్లడానికి సైతం అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లగేజీలతో క్యాంపస్ వదిలి వెళ్తున్నారు. మరోవైపు క్యాంపస్‌లోనే ఉంటున్న వారు అనవసరంగా బయటకు రాకూడదని నిరసనలకు దూరంగా ఉండాలని యూనివర్సిటీ యాజమాన్యం సూచించింది.
Also Read: యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!
హాస్టళ్లలో భద్రతా లోపాలను సరిదిద్దాలని, ముఖ్యంగా మహిళా హాస్టళ్ల వద్ద పనిచేసే మగవారి కదలికలపై ఆంక్షలు విధించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలసత్వం వహించిన హాస్టల్ వార్డెన్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని హామీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నిరసనలు కొనసాగుతున్న క్రమంలోనే సెప్టెంబర్ 10న తెలంగాణ విద్యార్థిని లక్షీ చంద్ర బిల్డింగ్ పై నుంచి దూకి అనుమానస్పదంగా మరణించిన విషయాన్ని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు. ఆ కేసులోనూ పూర్తి న్యాయం జరగాలని పట్టుబడుతున్నారు.
Also Read: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!