Mumbai: మంబయిలో గణేశ్ నిమజ్జన ఉత్సాహంలో ఉన్న వేళ ఊహించని విషాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గోరేగావ్ తూర్పు రామమందిర్ రైల్వే స్టేషన్ సమీపంలోని శివశంకర్ చాల్ పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ప్రభాకర్ ధనివర్ (24), భావిక్ దేశాయ్ (18)గా గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
రామమందిర్ ప్రాంతంలోని సాయికృపా మిత్ర మండల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. వేడుకల సమయంలో భావిక్, ప్రభాకర్ కాలకృత్యాల కోసం పక్కనే ఉన్న పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లారు. అయితే అరగంట గడిచినా వారు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు టాయిలెట్ వద్దకు వెళ్లి చూశారు. లోపల నుంచి తీవ్రమైన రసాయన దుర్వాసన రావడం, ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను జోగేశ్వరి ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రసాయన వ్యర్థాలే కారణమా?
టాయిలెట్ పక్కనే ఉన్న ఒక పరిశ్రమలో యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడి నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా డ్రైనేజీలోకి చేరడం వల్ల తీవ్రమైన విషవాయువులు వెలువడి, ఈ దారుణం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సాగునీటి రంగానికి పూర్వవైభవం.. రూ.160 కోట్ల బిల్లుల విడుదలపై మంత్రి నిమ్మల హర్షం