E-Paper
Advertisement

రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి కేవలం రూ.7 కోట్లకేనా? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి కేవలం రూ.7 కోట్లకేనా? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!
Advertisement

KTR Demands: స్వేచ్ఛ బ్యూరో: టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూమి కేటాయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కంపెనీ వివరాలు, దాని మూలధనం, ఉద్యోగుల సంఖ్య, కార్యాలయ చిరునామా, కంపెనీ చైర్మన్‌ వ్యవహారం, ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే ఇందులో భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద భూ కేటాయింపు అక్రమాల్లో ఒకటిగా తాము అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.

కంపెనీలపై కేటీఆర్ ఆరోపణలు..

Advertisement

టెస్సరాక్ట్‌ అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వివరాలను పరిశీలించినప్పుడు అనేక అనుమానాస్పద అంశాలు బయటపడుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫోన్‌ నంబర్‌ 123456789గా ఉందని, ఇలాంటి వివరాలు ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 2025 మార్చి 31 నాటికి కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని కంపెనీ వివరాల్లోనే పేర్కొన్నట్లు తెలిపారు. కంపెనీ పెయిడ్‌అప్‌ క్యాపిటల్‌ కేవలం రూ. లక్ష మాత్రమేనని, పటాన్‌చెరు ప్రాంతంలో ఒక చిన్న చిరునామాను కార్యాలయంగా చూపిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు..

Advertisement

ఇలాంటి ఆర్థిక సామర్థ్యం ఉన్న కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 5 ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని ఆరోపించారు. ఆ భూమిని సుమారు రూ.7 కోట్లకే, గజానికి సుమారు రూ.3,700 చొప్పున కేటాయించినట్లు తమకు అందిన వివరాలను ప్రస్తావించారు. “ఒక్క ఉద్యోగి లేని, రూ.లక్ష పెయిడ్‌అప్‌ క్యాపిటల్‌ ఉన్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం ఎలా సాధ్యమైంది? ఇది స్కాం కాదా?” అనిప్రశ్నించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ధర నిర్ణయం, అర్హత ప్రమాణాలు, పెట్టుబడి ప్రతిపాదనలు, ఉద్యోగాల కల్పన హామీలు, అధికారుల నిర్ణయాలు అన్నింటినీ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.టెస్సరాక్ట్‌ కంపెనీకి కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారన్నారు. అయితే కొండల్‌రెడ్డి స్వయంగా తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో టెస్సరాక్ట్‌ చైర్మన్‌గా పేర్కొన్నారని ప్రశ్నించారు. “మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలియదా?అనిశ్రీధర్‌బాబును నిలదీశారు.

కర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన కాంట్రాక్టులు, కంపెనీలపైనా తాము గతంలో ప్రశ్నలు లేవనెత్తామన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ వనరులు, భూములు, కాంట్రాక్టులు దక్కుతున్నాయా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. ‘కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూ కేటాయింపుపై విచారణ, రాజకీయ ప్రకంపనలు వచ్చినప్పుడు తెలంగాణలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కేటాయింపుపై ఎందుకు విచారణ జరగకూడదు?’ అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఒక న్యాయం, తెలంగాణలో మరో న్యాయం ఎలా ఉంటుందని నిలదీశారు.

భూ కేటాయింపు వ్యవహారాన్ని అసలు వదిలిపెట్టం..

టెస్సరాక్ట్‌ భూ కేటాయింపు వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ గవర్నర్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని, సమగ్ర విచారణ జరిపించాలని కోరుతామని తెలిపారు. అవసరమైతే లోకాయుక్తను, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని ప్రకటించారు. భూమి కేటాయింపు నుంచి కంపెనీ కార్యకలాపాల వరకు ప్రతి అంశాన్ని విచారించి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగిందా, నిబంధనలు ఉల్లంఘించారా, ఎవరికి ప్రయోజనం కలిగిందనే విషయాలను తేల్చాలని డిమాండ్‌ చేశారు.టెస్సరాక్ట్‌ కంపెనీ ఎవరిది, దాని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు, ప్రభుత్వ భూమి ఎందుకు కేటాయించారు, నిర్ణయం తీసుకున్న అధికారులు ఎవరు అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టెస్సరాక్ట్‌ వ్యవహారంతో పాటు ప్రభుత్వ భూములు, కాంట్రాక్టులు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని, ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్‌ తేల్చిచెప్పారు.

జల ఉద్యమం..

తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కష్టపడి సాధించిన నీటి ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఏడు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరుతుండగా, ఆ అంశాన్ని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) అజెండాలో చేర్చడం దారుణమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.కేంద్రం అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంటే, అదే అంశాన్ని కేంద్రం ఆధీనంలోని జీఆర్‌ఎంబీ అజెండాలో పెట్టడం ఎంతవరకు సమంజసమని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మగౌరవం, పౌరుషం ఉంటే సమావేశాన్ని బహిష్కరించాలని, ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని అజెండా నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

కేటీఆర్ హెచ్చరిక..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి, చనాకా–కొరటా వంటి ప్రాజెక్టులతో పాటు మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు తెలంగాణ ఎప్పుడూ అడ్డుకోలేదని, అదే విధంగా తెలంగాణకు చట్టబద్ధంగా వచ్చిన అనుమతులను రద్దు చేసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించడంతో పాటు అజెండా నుంచి అనుమతుల రద్దు అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో జల ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. అవసరమైతే జలసౌధను ముట్టడిస్తామని, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ ముందుండి పోరాడుతుందని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వైఖరి దారుణం

తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల వైఖరి చూస్తుంటే ‘8 + 8 = 0’ అని తాము ఊరికే అనలేదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కెన్‌–బెత్వా, పోలవరం, అప్పర్‌ భద్ర వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తుండగా, తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పినా ఒక్క తెలంగాణ ఎంపీ కూడా ప్రశ్నించలేదన్నారు.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని పాలమూరులో బీజేపీ నేతలు గతంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కూడా తెలంగాణ ఎంపీలకు లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. ప్రజలు భవిష్యత్తులో తెలంగాణ హక్కుల కోసం పోరాడే వారినే ఎన్నుకోవాలని కోరారు.

యాగాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లింపు..

పంప్‌హౌస్‌లను ఆన్‌ చేసి రైతులకు నీరు అందించకుండా ప్రభుత్వం యాగాల పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. నార్లాపూర్‌, కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘వరుణ యాగాలు చేయడంలో తప్పులేదు. కానీ యాగంతో పాటు చేయాల్సిన పని కూడా చేయాలి. దైవ ఆశీర్వాదానికి మానవ ప్రయత్నం తోడవాలి’ అని అన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డిసెంబర్ టార్గెట్.. రంగంలోకి విద్యాకమిషన్!

Tags

Related News

73.52 లక్షల ఓట్లు నిజంగానే తొలగించారా? బీజేపీ క్లారిటీ ఇదే!

ఇంట గెల‌వాల‌నే వ్యూహం….కేటీఆర్‌కు కంటి వెలుగు.. ఇక సిరిసిల్లా పై గురి..!

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డిసెంబర్ టార్గెట్.. రంగంలోకి విద్యాకమిషన్!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బిగ్ ప్లాన్!

క్యూర్ సిటీ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి 4 అంతర్జాతీయ సంస్థలు!

ఆగస్టు 15న అలజడికి పాక్ కుట్ర.. దేశ రాజధానిలో రక్షణ బలగాల ‘ఆపరేషన్ అలర్ట్’!

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

Big Stories

Advertisement
×