Lightning Deaths Bihar| బీహార్‌లోని అనేక జిల్లాలను తుఫాను గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు గందరగోళానికి గురిచేశాయి. బుధవారం ఉదయం రాష్ట్రంలోని బెగుసరాయ్, దర్భంగా, సమస్తిపూర్, మధుబని ప్రాంతాలలో పిడుగులు (Thunderstorm) పడటం వలన 13 మంది మృతి చెందారు. మధుబని జిల్లాలోని పిప్రౌలియా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వారిలో ఒకే కుటుంబ సభ్యులైన తండ్రి, అతని కుమార్తె ఉన్నారు. సమస్తిపూర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
మధుబనిలో అల్‌పురా గ్రామంలో చనిపోయిన తండ్రీ కూతుళ్లు 68 ఏళ్ల జాకీర్, 18 ఏళ్ల అమ్మాయి ఆయెషా.. అకాల వర్షం కురవడంతో తమ గోధుమ పంట తడిసిపోతుందని.. దాన్ని తడవకుండా టార్పాలిన్ కప్పడానికి వెళ్లారు. వారిద్దరిపై పిడుగుపడడంతో స్పాట్ లో చనిపోయారు. అలాగే జాంఝర్ పుర్ లో 45 ఏళ్ల దుర్గా దేవి భద్రపరిచిన ఆవులను షెడ్ లోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా ఆమెపై పిడుగు పడింది.
దర్భంగాలోని లాడో కఠియా గ్రామంలో 68 ఏళ్ల జవహర్ చౌపాల్ భారీ వర్షంలో తన గోధుమ పంట తడవకుండా భద్రపరుస్తుండగా అతనిపై పిడుగు పడి మరణించాడు.
Also Read: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం.. అసలేం జరిగింది?
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 13 మంది మరణించడంపై ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ.. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అకాలంగా వచ్చే వర్షాలు, తుఫాను పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. విపత్తు నివారణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రజలు వ్యవహరించాలని కోరారు.
బిహార్ లో ఈ పిడుగు పడే అవకాశాలు ఏప్రిల్ 13 వరకు ఉన్నాయని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విధంగా, బీహార్ ఆర్థిక సర్వే (2024-25) నివేదిక ప్రకారం.. 2023 సంవత్సరంలో పిడుగుల వలన రాష్ట్రంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా రాష్ట్రం బాలాసోరలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీ పిడుగు పాటు మరణాలపై రీసెర్చ్ చేసింది. ఇందులో షాకింగ్ విషయాలు తెలిశాయి.
1967 సంవత్సరం నుంచి ఈ పిడుగుపాటు మరణాలను రికార్డు చేయగా.. 1967 నుంచి 2020 మధ్యకాలంలో మొత్తం లక్షకు పైగా (1,01,309) మంది చనిపోయారు. అయితే 1967 నుంచి 2002 వరకు ప్రతీ సంవత్సరం భారతదేశంలో 38 మంది సగటను పిడుగు పడడంతో చనిపోగా.. 2003 నుంచి 2020 వరకు ప్రతీ ఏడాది 61 మంది మృతిచెందారు. అంటే మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మరణాలు 2010 నుంచి 2020 దశాబ్ద కాలంలో ఎక్కువగా జరిగాయి.
ఇందులో 50 శాతానికి పైగా మరణాలు మధ్య భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలలో సంభవించాయి. దీని కారణం భారతదేశంలో వరదలు, తుఫాన్లు, కరువు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని డీల్ చేయడానికి కొంతవరకు ఏర్పాట్లు, ముందుజాగ్రత్తలు ఉన్నాయి. కానీ పిడుగుపాటు ప్రమాదాలు నివారించడంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణ అవలంబిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా దేశాల్లో పిడుగుపాటు ఘటనలు నివారించడానికి తగిన భద్రతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ ఇండియాలోొ వేడిగాలులు, పిడుగుపాటు వల్ల ప్రజలు చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.
ఇండియాలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగుపాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. కానీ ఈ రాష్ట్రాలు ఇంతవరకు ఈ ప్రమాదాలను నివారించడంపై దృష్టిసారించలేదని స్టడీ పరిశోధకులు తెలిపారు.