Doctor Death Crocodile| సమాజంలో ఆ భగవంతుడితో సమానంగా హోదా ఒక్క వైద్య వృత్తికే ఉంది. మనిషి ప్రాణాలను కాపాడే అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉంటూ ఒక వైద్యుడు డబ్బు కోసం దుర్మార్గుడిగా మారాడు. హత్యలు, దొంగతనాలు, కిడ్నాపింగ్ లు, మానవ శరీర భాగాలు విక్రయం లాంటి నీచ పనులు చేశాడు. డాక్టర్ డెత్ గా పిలవబడే ఈ రాక్ష వైద్యుడి గురించి తెలుసుకున్న పోలీసులు కొన్నేళ్ల క్రితమే అరెస్ట్ చేశారు. ఇతనిపై ఉన్న కేసులు సంఖ్య ఎన్నటికీ తగ్గడం లేదు. ఒక కేసు విచారణ పూర్తి కాగానే మరో కేసు వెలుగులోకి వచ్చేది. దీంతో కోర్టు ఇతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆ తరువాత మరో కోర్టు మరో కేసులో ఇతనికి మరణ శిక్ష విధించింది. కానీ ఈ కిరాతకుడు పోలీసుల నుంచి రెండు సార్లు తప్పించుకొని పారిపోయాడు. ఏళ్ల తరబడి అతడి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం దౌసా ప్రాంతంలో ఉన్న ఒక స్వామిజీ ఆశ్రమంలో ఒక సన్యాసిగా ఉన్న 67 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ సన్యాసి మరెవరో కాదు ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో వేర్వేరు నేరాల కేసుల్లో నిందితుడు. తీహార్ జైలు నుంచి రెండేళ్ల క్రితం పారిపోయిన ఖైదీ. అతని పేరు దేవేంద్ర శర్మ. బిఎఎంస్ ఆయుర్వేద డిగ్రీ ఉన్న దేవేంద్ర శర్మ గురించి రాజస్థాన్ డిప్యూటీ కమిషనర్ ఆదిత్య గౌతమ్ మంగళవారం మీడియా సమావేశం పెట్టారు. ఆయన దేవేందర్ శర్మ గురించి మాట్లాడుతూ..”డాక్టర్ వృత్తిలో ఉంటూ దేవేంద్ర శర్మ 1994లో ఒక గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాడు. అయితే అందులో భారీ నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. ఆ తరువాత డబ్బు కోసం తన వైద్య వృత్తిని ఉపయోగించి హత్యలు చేయడం ప్రారంభించాడు. అమాయక ట్యాక్సీ, లారీ డ్రైవర్లను టార్గెట్ చేసేవాడు.
ట్యాక్సీ, లారీ అద్దెకు రెంట్ కు కావాలని పిలిచి ఆ డ్రైవర్లకు మత్తు మందు కలిపిన భోజనం పెట్టేవాడు. ఆ తరువాత వారిని చంపేసి వారి శరీరంలోని కిడ్నీలు, గుండె, లివర్, వంటి కీలక అవయవాలను బ్లాక్ మార్కెట్ లో విక్రయించేవాడు. అంతేదకాదు వారి లారీలు, ట్యాక్సీలు కూడా విడిభాగాలుగా చేసి అమ్మేసేవాడు. ఆ తరువాత శవాలను మొసళ్లు ఎక్కువగా ఉన్న హజారా కెనాల్ లో పడేసేవాడు. దీంతో అతడు చేసిన నేరాలను సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా చేసుకున్నాడు. రికార్డుల ప్రకారం.. మొత్తం 27 హత్యలు చేశాడు. అనధికారికంగా ఈ సంఖ్య 50 వరకు ఉండవచ్చు. మొత్తం 125 కిడ్నీ, గుండె, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ల కోసం అవయవాలు సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అతడిని పోలీసులు 2004లోనే అరెస్ట్ చేశారు.
Also Read: నకిలీ పెళ్లికొడుకు వేషంలో పోలీస్.. ఆ వధువుని ఏం చేశాడంటే
ఏడుగురి హత్యల కేసుల్లో ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా కోర్టులు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించాయి. 2020లో జైలు నుంచి 20 రోజుల పెరోల్ పై వెళ్లి దేవేంద్ర శర్మ ఆ తరువాత అటే పారిపోయాడు. ఏడు నెలల తరువాత పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ తరువాత గురుగ్రామ్ కోర్టు మరో హత్య కేసులో అతనికి ఉరి శిక్ష కూడా విధించింది. 2023 జూన్ నెలలో తీహార్ జైలు నుంచి మళ్లీ పెరోల్ పై విడుదలై ఆ తరువాత ఆగస్టు 3 నుంచి కనిపించకుండా పోయాడు. దేవేంద్ర శర్మ ప్రమాదకర క్రిమినల్ ని పట్టుకోవడానికి అలీగడ్, జైపూర్, ఢిల్లీ, ఆగ్రా, ప్రయాగ్ రాజ్ లాంటి నగరాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టి దాదాపు రెండేళ్ల తరువాత రాజస్థాన్ దౌసాలోని ఒక ఆశ్రమం నుంచి పట్టుకున్నారు.” అని వెల్లడించారు.