22 Dead in Massive Fire at Gaming Zone in Rajkot: గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని భారీగా మృత్యువాతపడ్డారు. గేమింగ్ జోన్ ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉన్న ఓ గేమింగ్ జోన్ లో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. క్షణాల్లో ఆ మంటలు అంతటా వ్యాపించాయి. ఆ మంటల్లోకి చిక్కి 24 మంది సజీవదహనమైనట్లు, పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంపై కేంద్రం విచారం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, మంటల్లో చిక్కి గాయాలపాలైన క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వారికి మెరుగైన చికిత్స అందిచాలన్నారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్రం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
స్థానిక పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలిసిరాలేదన్నారు. ప్రస్తుతం ఫైరింగ్ సిబ్బంది మంటలార్పుతున్నారు. పూర్తిగా మంటలు ఆర్పినంక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందులో మంటలు, పొగలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎగిసిపడుతున్న ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు.. ప్రమాదం సంభవించడంతో చుట్టపక్కల ప్రజలు భారీగా అక్కడ గుమిగూడిన దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.
ఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలియక హడలిపోతున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసుకుంటూ సమాచారం తెలుసుకుంటున్నారు.
#WATCH | Gujarat: A massive fire breaks out at the TRP game zone in Rajkot. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/f4AJq8jzxX
— ANI (@ANI) May 25, 2024
అదేవిధంగా యూపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు సజీవదహనమయ్యారు. అటుగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ అందులోనే సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు కారును చుట్టుముట్టాయని, అలా మంటలు చుట్టుముట్టడంతో వారు తప్పించుకునే అవకాశం లేకుండాపోయిందని, దీంతో కారులోనే ఆ దంపతులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపినట్లు సమాచారం.